జ‌గ‌న్ స‌ర్కార్.. ఉచిత జ్యోతి కొండెక్కిన‌ట్టేనా?

Update: 2022-06-21 07:43 GMT
ఎస్సీ, ఎస్టీల‌కు 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత క‌రెంటును అందిస్తున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆ ప‌థ‌కాన్ని కొండెక్కించిందా అంటే అవున‌నే అంటున్నారు.. ల‌బ్ధిదారులు. ఈ ప‌థ‌కం కింద ఇప్ప‌టివ‌ర‌కు అందించిన ఉచిత విద్యుత్ ను ఇప్పుడు ఉప‌సంహ‌రించుకోవ‌డం అన్యాయ‌మ‌ని ల‌బ్ధిదారులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇప్ప‌టికే ప‌లు జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ ల‌బ్ధిదారులు ఆయా జిల్లాల క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు. ఎన్నో ఏళ్లుగా ఒకే చోట ఉంటున్న త‌మ‌కు 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ ను వ‌ర్తింప‌జేస్తున్నార‌ని.. జూన్ నెల నుంచి మాత్రం బిల్లులు చెల్లించాలంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీల‌కు 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ అందించాల్సి ఉన్నా ఆ ప‌థ‌కానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం మంగ‌ళం ప‌ల‌క‌డం దారుణ‌మ‌ని ల‌బ్ధిదారులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జూన్ నెల‌కు బిల్లులు చెల్లించాల‌ని అధికారులు త‌మ‌కు బిల్లులు జారీ చేశార‌ని.. వీటిని ఉప‌సంహ‌రించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉచిత విద్యుత్ ప‌థ‌కాన్ని కేవ‌లం ఎస్సీ కాల‌నీలు, ఎస్టీ తండాల‌కు మాత్ర‌మే వ‌ర్తింప‌జేస్తోందని ఆరోపిస్తున్నారు. తాము కూడా ఒకే చోట ఉంటున్నా త‌మ‌కు ఎందుకు వ‌ర్తింప‌జేయ‌డం లేద‌ని మండిప‌డుతున్నారు.

మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాలు కూడా ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతున్నారు. ఎస్సీ, ఎస్టీలంద‌రికీ 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ ప‌థ‌కాన్ని అందించాల్సి ఉండ‌గా.. కేవ‌లం ఎస్సీ కాల‌నీలు, ఎస్టీ తండాల‌కు మాత్ర‌మే ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేస్తామ‌ని ప్ర‌భుత్వం కొత్త నిబంధ‌న తేవ‌డం ఏమిట‌ని ధ్వ‌జ‌మెత్తుతున్నారు. య‌థావిధిగా ఎస్సీ, ఎస్టీలంద‌రికీ ఉచిత విద్యుత్ ను వ‌ర్తింప‌జేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మ‌రోవైపు ఈ విష‌యంలో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు.

ఒక్క నెలలోనే ఇలా దాదాపు లక్షా 40వేల మందిని విద్యుత్ రాయతీకి అనర్హులుగా నిర్ధారించి పథకాన్ని నిలిపేసినట్లు విమర్శలు వస్తున్నాయి. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.600 కోట్లు మిగులుతుందని ప్రతిపక్షాలు విమ‌ర్శిస్తున్నాయి. దళిత సంఘాల‌న్నీ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ప్ర‌శ్నించాల‌ని.. ఆందోళ‌నలు నిర్వ‌హించాల‌ని ప్ర‌తిప‌క్షాలు పిలుపునిస్తున్నాయి.
Tags:    

Similar News