జగన్ సర్కారును దెబ్బేయనున్న సూరీడు!

Update: 2022-05-03 00:30 GMT
ఒక ప్రభుత్వ సమర్థతకు కొలమానం ఏమిటంటే.. ప్రజలకు ఎదురయ్యే సమస్యల్ని ముందుగా గుర్తించటం.. వారికి ఇబ్బందులు తలెత్తకుండా పాలనను సాగించటం.. రానున్న రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను గుర్తించి.. వాటిని అధిగమించే ప్రణాళికల్ని సిద్ధం చేయటం.

వీటి విషయంలో ఏపీలోని జగన్ సర్కారు అడ్డంగా ఫెయిల్ అయ్యిందని చెప్పక తప్పదు. గతానికి భిన్నంగా ఈ ఏడాది వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం.. విద్యుత్ వినియోగం భారీగా పెరగటం.. ఈ ట్రెండ్ దేశం మొత్తం ఉండటంతో కొత్త సమస్యలు తలెత్తాయి.

గతంతో పోలిస్తే.. విద్యుదుత్పత్తి భారీగా పెరిగినప్పటికి.. తాజా వేసవిలో వినియోగిస్తున్న విద్యుత్ కు సరిపడా ఉత్పత్తి లేని పరిస్థితి. దీంతో.. దేశంలోని పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు తప్పని పరిస్థితిగా మారింది. ఏపీలో అమలవుతున్న విద్యుత్ కోతలు.. జగన్ ప్రభుత్వానికి మా చెడ్డ చిరాకుగా మారాయి. ప్రభుత్వ ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేశాయి. మొన్నటికి మొన్న టీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తన స్నేహితుడు సంక్రాంతికి పక్క రాష్ట్రానికి వెళ్లినప్పుడు అక్కడ విద్యుత్ కోతలు ఉన్నట్లుగా చెప్పటం తెలిసిందే.

మంత్రి కేటీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలు ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా చేయటంతో పాటు.. అందుకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిన వైసీపీ నేతలంతా ఏపీలో పవర్ కట్స్ లేవని చెప్పకుండా.. మిగిలిన అంశాల్ని ప్రస్తావించటం గమనార్హం. ఇక.. మే ఒకటి నుంచి రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని.. అదనపు విద్యుత్ అందుబాటులోకి వస్తుందని చెప్పిన మంత్రి పెద్దిరెడ్డి మాటలు ఆచరణలో అయ్యేట్లుగా లేవని చెబుతున్నారు.

దీనికి కారణం దేశ వ్యాప్తంగా పెరిగిన విద్యుత్ వినియోం.. ఇందుకు తగ్గట్లుగా ఉత్పత్తి లేని నేపథ్యంలో కొరత.. కోతలు తప్పవన్న మాట వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా ఏపీలోని పరిశ్రమలకు పవర్ హాలిడేను మరో 15 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజుకు 220 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. అయితే.. రాష్ట్రంలో విద్యుదుత్పత్తి అందుకు తగ్గట్లుగా లేని పరిస్థితి.

దీంతో.. సర్దుబాటు కోసం 34 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను పవర్ ఎక్సైంజ్ నుంచి డిస్కంలు కొంటున్నాయి. విద్యుత్ కోతలతో కలుగుతున్న నష్టాన్ని భర్తీ చేసేందుకు అదనపు విద్యుత్తును కొనుగోలు చేయాలని భావిస్తున్నా.. మార్కెట్లోలభ్యత అంతగా లేదంటున్నారు. ఇదిలా ఉంటే పవన విద్యుత్ ఉత్పత్తి పెరిగిన కొద్దీ.. కొంత ఉపశమనంగా మారుతుందంటున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ వేసవిలో జగన్ సర్కారుకు విద్యుత్ కోతల షాకులు తప్పవన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News