జగన్ సర్కారు టెన్షన్ తీర్చిన ఆరున్నర గంటల చర్చ.. సమ్మె విరమణకు ఓకే

Update: 2022-02-06 03:30 GMT
ఎట్టకేలకు.. జగన్ సర్కారు టెన్షన్ తీరింది. కోతి పుండు బ్రహ్మ రాక్షసి టైపులో.. ఉద్యోగ సంఘాల నిరసన అనూహ్య పరిణామాలకు తెర తీయటం.. మూడేళ్లలో ఎప్పుడూ లేని రీతిలో ఏపీ సర్కారుకు షాకివ్వటం తెలిసిందే. దీంతో ఏపీ ఉద్యోగ సంఘాలు ప్రకటించిన సమ్మె జరగకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం మంత్రివర్గ కమిటీని రంగంలోకి దింపింది. ఇందులో భాగంగా శుక్రవారం అర్థరాత్రి ఒంటి గంట వరకు.. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అంటే.. ఆరున్నర గంటల సుదీర్ఘ చర్చల అనంతరం.. సమ్మె విరమణకు ఓకే చెబుతూ ఉద్యోగ సంఘాలు ప్రకటన చేశాయి.

ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఉద్యోగ సంఘాలు కోరినట్లుగా హెచ్ఆర్ఏ కొంతమేర పెంచేందుకు.. సీసీఏ కొనసాగించేందుకు.. అదనపు క్వాంటం పెన్షన్ ను 70 ఏళ్ల నుంచే అమలు చేసేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో.. ఉద్యోగ సంఘాలు ప్రకటించిన సమ్మె ప్రతిపాదనకు చెల్లుచీటి ఇచ్చారు. మొదట్నించి కాస్తంత బెట్టు చేసిన మంత్రుల కమిటీ శనివారం చర్చల్లో మాత్రం మెట్టు దిగింది. పలు డిమాండ్లకు సానుకూలంగా స్పందించింది. ఫిట్ మెంట్ ను 23 శాతం కంటే పెంచాలన్న డిమాండ్ కు మాత్రం నో చెప్పింది. మెడికల్ రీయంబర్స్ మెంట్ సదుపాయాన్ని పొడిగించేందుకుఓకే చెప్పింది.

పెంచిన గ్రాట్యయుటీని 2018 నుంచి కాకుండా 2022 జనవరి నుంచి మాత్రమే అమలు చేస్తానంది. ఇలా ప్రభుత్వం రెండు మెట్లు దిగితే.. అందుకు ప్రతిగా ఉద్యోగ సంఘాలు సైతం ముకుంపట్టుకు పోకుండా.. ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకొని.. తమ డిమాండ్లను కొన్నింటిని ఓకే చెప్పించుకొని.. మరికొన్నింటి విషయంలో వెనక్కి తగ్గాయి. సుదీర్ఘ చర్చల అనంతరం.. రాత్రి పది గంటల వేళ.. సమ్మె ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు.

మంత్రుల కమిటీతో చర్చల సందర్భంగా శనివారం మధ్యాహ్న వేళ నల్లబ్యాడ్జీలతో చర్చలకు హాజరైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు.. రాత్రి పది గంటల సమయంలో మీడియాతో మాట్లాడే సమయంలో తమ నల్ల బ్యాడ్జీలను తొలగించి మట్లాడారు. ఇదిలా ఉంటే.. విలేకరుల సమావేశాన్ని బహిష్కరించిన పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు.. ఏపీటీఎఫ్ 1938 అధ్యక్షుడు.. యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్.. ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య.. ఏస్టీయూ అధ్యక్షుడు సుధీర్ బాబు మాత్రం ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.

ఉద్యోగుల డిమాండ్లలో మొదటిలైన 27 శాతం ఫిట్ మెంట్ ను కూడా సాధించుకోలేకపోయామని.. 30 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని డిమండ్ చేశారు. ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు చేసుకున్న ఒప్పందాన్ని వారు నిరసించారు. దాదాపు ఆరున్నర గంట లపాటు సాగిన చర్చల్లో ఎక్కువ సేపు హెచ్ఆర్ఏ మీదనే చర్చ జరిగినట్ులగా చెబుతున్నారు. ఫిట్ మెంట్ ను కనీసం 27 శాతానికి పెంచాలని కోరితే.. అది ముగిసిన అంకమని.. దానిపై ఇది వరికే నిర్ణయం అయిపోయిన నేపథ్యంలో దానిపై చర్చకు అస్కారం లేదని మంత్రుల కమిటీ స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా తాము అనుకున్న రీతిలో డిమాండ్లను సాధించుకోనప్పటికీ..తాము అడిగిన వాటిలో కొన్నింటికి ప్రభుత్వం ఓకే చెప్పిన నేపథ్యంలో.. సమ్మె ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నట్లుగా చెబుతున్నాయి. అయితే.. ఉద్యోగ సంఘాల మధ్య మాత్రం విబేదాలు పొడచూపినట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News