జగన్ అనుకున్నది చేశాడు.. బాబు ఎక్కడుంటారు?

Update: 2020-08-02 12:00 GMT
ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చింది. విభజన నేపథ్యంలో ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన హైదరాబాద్ ను తలదన్నేలా.. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా నిర్మిస్తానని చెబుతూ.. అమరావతి విషయంలో ఎన్ని మాటలు చెప్పారో తెలిసిందే. ఎన్నికల వేళకు.. అమరావతిలో నిర్మాణాలు ఒక కొలిక్కి తేవాలని భావించినా.. తేలేకపోయాడు. కొన్ని భవనాలు కట్టించినా.. అవేమీ బాబుకు అక్కరకు రాలేదు.

మొత్తంగా ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. దీనిలో అమరావతి పాత్ర అంతో ఇంతో ఉందని చెప్పాలి. ఒక రాజధాని నగరాన్ని నిర్మించటం అంత ఆషామాషీ కాదు. హైదరాబాద్ లో ఇప్పుడు కనిపిస్తున్న సైబరాబాద్ ను చూస్తే.. దాని వెనుక పాతికేళ్ల కష్టం ఉందన్నది మర్చిపోకూడదు. అలాంటిది పోలాల్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి.. దాన్ని టౌన్ షిప్ గా మార్చటం ఐదేళ్లలో సాధ్యమయ్యే పని కాదు. జగన్ సర్కారు కొలువు తీరటం.. రాజధానిగా అమరావతి కాదు.. మూడు ప్రాంతాల్ని రాజధానులుగా చేయాలన్న కొత్త కాన్సెప్టును తెర మీదకు తీసుకురావటమే కాదు.. తాను అనుకున్న పనిని పూర్తి చేశారు.

పేరుకు మూడు రాజధానులే అయినా.. కార్యనిర్వాహఖ వ్యవస్థకు కేంద్రంగా ఉన్న నగరాన్నే రాజధాని కిందకు తీసుకుంటారు. ఆ లెక్కన చూస్తే విశాఖ ఏపీకి రాజధాని నగరంగా మారుతుంది. అంటే.. రానున్న రోజుల్లో విశాఖ కేంద్రంగానే రాజధాని విస్తరించటం ఖాయం. మరి.. ముఖ్యమంత్రి.. మంత్రులు.. డీజీపీతో సహా సెక్రటేరియట్ మొత్తం విశాఖకు షిఫ్ట్ కానున్నట్లే. అదే జరిగితే..ప్రతిపక్ష నేత పరిస్థితి ఏమిటి? అన్నది ప్రశ్న.

మూడు రాజధానుల్ని తీవ్రంగా వ్యతిరేకించి అమరావతినే రాజధానిగా వాదించిన చంద్రబాబు విశాఖలో ఉంటారా? లేక.. అమరావతి కేంద్రంగానే ఉంటూ తన డిమాండ్ ను వినిపిస్తూనే ఉంటారా? అన్నది ప్రశ్న. ఇక్కడ సమస్య ఏమంటే.. విశాఖకు బాబు షిఫ్ట్ అయితే.. అమరావతి ప్రజల్లో బాబు మీద ఆగ్రహం కలగటం ఖాయం. అదే సమయంలో విశాఖకు షిఫ్ట్ కాకుండా అమరావతి ప్రాంతంలో ఉంటే.. రాజధాని నగరంలో విపక్ష నేత లేకపోవటం సబబుగా ఉండదు. మొత్తానికి మూడు రాజధానుల వ్యవహారం ఏమో కానీ.. ఇప్పుడున్న సమస్యలకు ఇదో సమస్యగా బాబుకు మారేలా ఉందని చెప్పక తప్పదు.


Tags:    

Similar News