రాజధాని అమరావతిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Update: 2020-12-25 14:30 GMT
క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో ఇళ్ల స్థలాల పంపిణీ పైలాన్ ను సీఎం ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు.

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం జగన్ రాజధాని అమరావతి గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని కులాలు, మతాలు, అన్ని ప్రాంతాల వారు ఉంటేనే అది రాజధాని అవుతుందని.. ఫలానా కులం వారు.. మతం వారు ఇక్కడ ఉండొద్దంటే అది రాజధాని ఎలా అవుతుందని జగన్ ప్రశ్నించారు.

అందరికీ చోటు ఇస్తేనే అది సమాజం అవుతుందని.. అందరికీ మంచి చేస్తేనే అది ప్రభుత్వం అనిపించుకుంటుందని సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాంటి సమాజాన్ని.. రాజధానిని మనం నిర్మించుకుందామని జగన్ అన్నారు.

ఏపీలో 15 రోజుల పాటు ఇళ్ల పండుగ జరుగుతోందని.. ఇళ్లు కాదు.. ఊళ్లు కడుతున్నామని జగన్ అన్నారు. 28.30 లక్షల ఇళ్ల స్థలాల్లో ఇళ్లు, మరో 2.62 లక్షల టిడ్కో ప్లాట్లు పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఇంతకంటే దేవుడు తనకిచ్చే వరం ఏమి ఉంటుందని అన్నారు.

అమరావతిలో 54వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటే అడ్డుకున్నారని.. నిన్న హైకోర్టుల్లో పిల్ వేశారని.. కొందరు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే ఓర్వలేకపోతున్నారని జగన్ విమర్శించారు.
Tags:    

Similar News