బాబుకు దిమ్మ‌తిరిగే ప్లాన్ వేసిన జ‌గ‌న్‌

Update: 2017-03-03 04:56 GMT
గోదావరి జిల్లాలంటే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు ఎంత ప్రేమ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సంద‌ర్భం ఏదైనా అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా బాబు త‌న ప్రేమ‌ను చాటుకుంటారు. అదే గోదావ‌రి జిల్లాలోఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బాబుకు షాక్ ఇచ్చేందుకు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్రణాళిక సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్సీల పంటతో కళకళలాడనుంది. జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు రెండు ఉండగా వాటికి ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్త‌వుతోంది. ఈ రెండు స్థానాలతో పాటు మరో ఎమ్మెల్సీ స్థానం కూడా జిల్లాకు అదనంగా లభించే అవ‌కాశం ఉంది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీ నుండి షరీఫ్ - యుటిఎఫ్ నుండి రాము సూర్యారావు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కోటాలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) పేరును ప్రకటించింది. ఈ ప్ర‌క‌ట‌న వెనుక జ‌గ‌న్ దూర దృష్టి ఉందంటున్నారు.

అధికార పార్టీ ఉన్న రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను ఒకటి బీసీలకు - మరొకటి ఓసీలకు కేటాయించింది. ఉభయగోదావరి జిల్లాల వేదికగా ముద్రగడ పద్మనాభం తన ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్మిస్తున్న నేపథ్యంలో ఆ వర్గానికి చెందిన వారికి ఒక స్థానాన్ని కేటాయించి, ఆ వర్గాన్ని కొంత శాంత పరుస్తారన్న ప్రచారం జరిగినా చివరకు అభ్యర్థుల ప్రకటన అనంతరం ఆ ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. ఇదే సమయంలో ప్రతిపక్ష వైసీపీ తనకున్న పరిమిత ఎమ్మెల్యే స్థానాల్లో ఒకటి ఉభయగోదావరిలో బలీయమైన శక్తిగా ఉన్న‌ వర్గానికి కేటాయించి రాజకీయం ముందడుగు వేసినట్లు చెప్పుకోవచ్చు. వైకాపా ఎమ్మెల్యేల కోటా అభ్యర్ధిగా ఎంపికైన ఆళ్ల నాని ప్రస్తుతం ఆ పార్టీ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. 2004 - 2009 సంవత్సరాల్లో వరుసగా రెండు సార్లు ఏలూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏలూరు నుంచి వరుసగా రెండుసార్లు ఎంపికైన ఎమ్మెల్యే ఆళ్ల నాని మాత్రమే కావడం గమనార్హం. నియోజకవర్గం - జిల్లాకు సంబంధించి ఆళ్ల నాని బలమైన నాయకునిగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. రాజకీయ ఎత్తుగడల్లో చురుగ్గా వ్యవహరిస్తూ, ప్రత్యర్థులను అలవోకగా అధిగమించడంలో ఆళ్ల నానిది అందెవేసిన చెయ్యి అనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో బలమైన నాయకునిగావున్న ఆళ్ల నాని వంటి నేత విపక్షం తరపున జిల్లాలో ఎమ్మెల్సీగా ముందుకువస్తే రానున్న రోజుల్లో సమీకరణల్లో భారీగా మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.

అయితే ఎమ్మెల్యే కోటాకు సంబంధించి అధికార పార్టీ ఇంత వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ సమయంలో జ‌గన్ ఎత్తుగ‌డ‌కు స్పంద‌న‌గా టీడీపీ దీనికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ఉభయగోదావరి జిల్లాల రాజకీయ సమీకరణాలు, వర్గ సమీకరణాల నేపథ్యంలో టీడీపీ తీసుకునే నిర్ణయం రానున్న రోజుల్లో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుందనే చెప్పుకోవాలి. అయితే బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గం, ప‌ట్టున్న నేత‌ను ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థిగా ప్ర‌క‌టించ‌డం ద్వారా వైసీపీ బాబుకు ఇష్ట‌మైన జిల్లాలో షాక్ ఇచ్చింద‌నేది నిజ‌మ‌ని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News