జ‌గ‌న్‌ కు త‌న ప్ర‌త్య‌ర్థి ఎవ‌రో తెలిసిపోయింది

Update: 2017-02-19 10:17 GMT
ప్రధాన ప్రతిపక్షంగా ఇటీవ‌ల క్రియాశీలంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డంతో పాటు యువ‌భేరీల ద్వారా ముందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల వ్యూహాల‌ను కూడా సిద్ధం చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌ను వేగం చేయ‌డం, రాబోయే ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగుతాన‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో త‌మ ప్ర‌ణాళిక‌ల‌ను మ‌రింత భిన్నంగా అమ‌ల్లో పెడుతున్న‌ట్లు స‌మాచారం. జనసేన పార్టీ రంగంలోకిదిగనుండటంతో తన వ్యూహం ను మార్చుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా జనసేన పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో  ఒంటరిగా బరిలోకి దిగాన ఆ తరువాత అధికార టీడీపీతో జతకట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. టీడీపీ, జనసేన కలయిక మున్ముందు తనకు సవాల్‌గా మారకూడదన్న దిశగా వైసీపీ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప్ర‌స్తుత జనసేన పార్టీ ముందున్న అస్త్రాలు ఏపీకి ప్రత్యేకహోదా, రాష్ట్ర విభజన బిల్లులోని హామీల అమలు మాత్రమేనని ప్రధాన ప్రతిపక్షం అంచనా వేస్తోంది. రాష్ట్రంలోని అధికార టీడీపీ పాలనపై జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తీవ్రస్థాయిలో విమర్శలకు దిగకపోవడంతో ఆయనకు ప్రత్యేకహోదా, విభజన బిల్లు హామీలే ప్రధాన అస్త్రాలు అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో తన పార్టీ ఉనికి కోసం పవన్‌ కళ్యాణ్‌ ఈ అంశాలపైనే ఉద్యమాలు చేయాల్సిఉండటంతో ఆ విషయాలలో తాము ఓ అడుగు ముందుకేస్తే జనం మద్దతు తమకే పదిలంగా ఉంటుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. అనంతపురంలో సభను ఏర్పాటుచేసిన జనసేన పార్టీ ఆ సభలో ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని కీలకంగా తీసుకొని తన గర్జనను ప్రారంభించిప‌ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన యువ భేరీ కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏపీకి ప్రత్యేకహోదా కోసం అవసరమైతే తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని వెల్లడించిన విషయం తెలి సిందే. తద్వారా ఏపీకి ప్రత్యేకహోదా అంశంలో తనదే పైచెయ్యి అని చాటిచెప్పే యత్నం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసిందని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ తన రీఎంట్రీ ప్రారంభించడంతో పూర్తిస్తాయిలో ఆ పార్టీ ఒక్కటే ఎన్నికలను ఎదుర్కోలేదని రాజకీయవర్గాలలో చర్చ సాగుతోంది. ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం ఇంతవరకు తెరపైకి రాకపోవడం, ఆయన పార్టీలోకి మున్ముందు ఎవరు వెళ్తారు అన్నది స్పష్టత రాకపోవడం వంటి పరిణామాలలో జనసేన పార్టీ ఏదో ఒక పార్టీతో కలసివెళ్లే అవకాశాలే ఎక్కువ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనకున్న క్షేత్రస్థాయి క్యాడర్‌ వల్ల వచ్చే ఎన్ని కల్లో గెలుపుకోసం కృషిచేస్తే తమకే అవకాశాలు మెండుగా ఉంటాయని వైసీపీ భావిస్తోంది.

ఒకవేళ టీడీపీ - జనసేన పార్టీలు కలిస్తే ఈ  ఎన్నికలు కాస్త తమకు సవాల్‌ గా మారుతాయని, అయినాదానిని అధిగమించే సత్తా తమకు ఉందని వైసీపీ భ‌రోసాతో ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం జనసేన పార్టీ క‌ద‌లిక‌ల‌పై ఓ క‌న్నేసి పెట్టినట్లు సమాచారం. ఏ ఆందోళనకు జనసేన పార్టీ  పిలుపునిచ్చినా తనకున్న నాయకత్వ పటిమతో వాటి విషయంలో ఒక్కడుగు తానే ముందుకేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. త‌న పార్టీకి ఎంపీ - ఎమ్మెల్యే - ఎమ్మెల్సీల బలముండటం - క్షేత్రస్థాయిలో పార్టీకి నాయకత్వం ఉండటం ఇవన్నీ తమకు బాగా కలిసొస్తాయని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన పార్టీ ఏ ఆందోళనకు పిలుపునిచ్చినా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ స్వతహాగా పాల్గొన్న చోటే యువత సమీకరణ సాగుతుందని, మిగితా చోట్ల ఆయన పార్టీకి క్యాడర్‌ లేకపోవడం వల్ల ప్రభావితం చేసే నేతలు లేకపోవడం వల్ల దానికి జనం మద్దతు అంతంత మాత్రమే ఉంటుందని వారు పేర్కొంటున్నారు. తమ పార్టీ చేపట్టే ప్రతి ఆందోళనకు జనం నుంచి మంచి స్పందన వస్తుందని, ఈ పరిస్థితుల్లో ఆందోళనల విషయంలో జనసేన కంటే ఒక అడుగు ముందుండేలా తాము జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైసీపీ వ‌ర్గాలు భ‌రోసాగా ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News