బాబు ర‌హ‌స్య జీవోల లెక్క తేలిందిగా

Update: 2017-11-06 07:57 GMT
ఏపీ ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష నేత‌ - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ప్రారంభం అయింది. పాదయాత్ర ప్రారంభించిన సంద‌ర్భంగా ఆయన ఒక జాతీయ వార్తా సంస్థతో మాట్లాడారు. ప్రభుత్వం వ్యవహార శైలి అప్రజాస్వామికంగా ఉందని వైకాపా అధినేత జగన్ అన్నారు. అసెంబ్లీ లోపలా - బయటా కూడా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు తమకు అసలు అవకాశమే ఇవ్వడం లేదన్నారు. చంద్ర‌బాబు ఎవరికీ తెలియకుండా రహస్యంగా జీవోలను విడుదల చేస్తున్నదన్నారు. అలా దాదాపు 200 రహస్య జీవోలను విడుదల చేసిందని జగన్ చెప్పారు. ఇన్ని ర‌హ‌స్య జీవోల‌తో బాబు ఏం చేశారో ప్ర‌జ‌ల‌కు తెలియాల్సి ఉంద‌ని అన్నారు.  

ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధపు హామీలు - అసమర్ధ పాలనతో జనం నిరాశా నిస్ఫృహలకు గురయ్యారని జగన్ అన్నారు. వారిలో నమ్మకాన్ని కలిగించేందుకే తానీ పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. ఈ పాదయాత్రలో తమ దృష్టికి వచ్చిన సమస్యలే తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటాయని జ‌గ‌న్ తెలిపారు. అధికారంలోనికి వచ్చిన తరువాత ఆ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని చెప్పారు. మైక్రో ఫైనాన్స్‌ ద్వారా అప్పులు తెచ్చుకుని అనేక కష్టనష్టాలకు గురై - ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు డాక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డి ఉచిత విద్యుత్‌  - 108 - 104 సర్వీసులు - వైఎస్‌ అభయ హస్తం - ఫీజు రీఎంబర్స్‌ మెంటు లాంటి పథకాలను ప్రవేశపెట్టి అందరి మన్ననలను చూరగొన్నారని గుర్తు చేశారు. అయితే డాక్టర్‌ వైఎస్‌ ప్రవేశపెట్టిన పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ముఖ్యంగా ఆరోగ్య శ్రీ పథకం విషయంలో ఏపీలో ఉన్న ప్రజలకు మనరాష్ట్రంలోనే చికిత్స చేయించుకోవాలన్న నిబంధనలను ప్రవేశపెట్టడాన్ని చూసి తనకు బాధకలుగుతోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయిన మన రాష్ట్రంలో ఎలాంటి సరైన వైద్య సౌకర్యాలు లేవని - కేవలం విశాఖ - విజయవాడ లాంటి నగరాల్లో మాత్రమే వైద్య సౌకర్యాలు ఉన్నాయని, మనరాష్ట్రంలోని చాలా మంది ప్రజలు ఇప్పటికీ హైదరాబాద్‌ లో నివసిస్తూ తమ పిల్లల్ని అక్కడే చదివించుకుంటున్నారన్న విషయాన్ని జ‌గ‌న్ పేర్కొన్నారు. వైఎస్‌ హయాంలో 70 లక్షల ఫింఛన్లను పంపిణీ చేస్తే ఇప్పుడు ఆ సంఖ్యను చంద్రబాబు 50 శాతానికి తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలాఉండగా...ఇడుపుల పాయ నుంచి వైకాపా అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ రోజు ఆయన 8 కిలోమీటర్లు నడవనున్నారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి సోమవారం ప్రారంభించ నున్న ఈ పాదయాత్ర జిల్లాలో ఈనెల 13 వరకు సాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 125 నియోజకవర్గాల్లో 6 నెలలపాటు 3వేల కిలోమీటర్ల దూరం ఈ పాదయాత్ర సాగనుంది. వచ్చే ఏడాది మే నెల 2న జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర ముగియనుంది.
Tags:    

Similar News