ఆ బాబుల‌కు పోస్టింగులు ద‌క్క‌లేదు

Update: 2019-06-05 04:21 GMT
పాల‌నాప‌రంగా మార్పులు తెచ్చేందుకు వీలుగా ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  పెద్ద ఎత్తున ఐఏఎస్.. ఐపీఎస్ ల్ని బ‌దిలీ చేయ‌టం తెలిసిందే. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న వారు.. చంద్ర‌బాబు.. లోకేశ్ కు ద‌గ్గ‌ర‌గా ఉన్నార‌న్న అభిప్రాయం ఉన్న అధికారుల‌కు అప్రాధాన్య‌త పోస్టులు ద‌క్కాయి. అదే స‌మ‌యంలో.. కొంద‌రికి పోస్టింగులు ఇవ్వ‌లేదు.

ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసినంత‌నే సీఎం పేషీకి చెందిన ప‌లువురు కీల‌క అధికారుల్ని బ‌దిలీ చేసి.. వారికి ఎలాంటి పోస్టులు ఇవ్వ‌ని జ‌గ‌న్‌.. తాజాగా అదే బాట‌లో మ‌రికొంద‌రు అధికారుల విష‌యంలో వ్య‌వ‌హ‌రించారు. ఇలాంటి వారిలో సీనియ‌ర్ అధికారులు అజ‌య్ జైన్.. విజ‌యానంద‌.. కార్తికేయ మిశ్రా.. ఉద‌య‌ల‌క్ష్మి.. శ‌శిభూష‌ణ్.. క‌న్న‌బాబు.. రంజిత్ బాషాతో పాటు అనురాధ‌లున్నారు. వారంద‌రిని జ‌న‌ర‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ శాఖ‌కు రిపోర్ట్ చేయాల‌ని కోరారు.

వీరికి ముందు సీఎం పేషీలోకి చెందిన కీల‌క అధికారులు స‌తీశ్ చంద్ర‌.. సాయి ప్ర‌సావ్‌.. రాజ‌మౌళి ల‌ను ఇప్ప‌టికే జీఏడీకి రిపోర్ట్ చేయ‌మ‌ని ఆదేశించ‌టం తెలిసిందే. బాబు.. లోకేశ్ బాబుల వ‌ద్ద మంచి ప‌లుకుబ‌డి ఉండి.. వారితో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌న్న పేరున్న అధికారుల విష‌యంలో జ‌గ‌న్ వారికి ఎలాంటి ప‌ద‌వులు ఇవ్వ‌లేదు.

అదే స‌మ‌యంలో బాబు ప్ర‌భుత్వంలో కీల‌క భూమిక పోషించిన ప‌లువురు అధికారుల‌కు అప్రాధాన్య‌త శాఖ‌ల్ని క‌ట్ట‌బెట్టారు. అలాంటి వారిలో రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ క‌మిష‌న‌ర్ చెరుకూరి శ్రీ‌ధ‌ర్.. కార్య‌ద‌ర్శి నాగుల‌ప‌ల్లి శ్రీ‌కాంత్‌.. పీయూష్ కుమార్.. పూనం మాల‌కొండ‌య్య త‌దిత‌రులు ఇందుకు నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు.


Tags:    

Similar News