ఆయనకు జగన్ నుంచి పిలుపొచ్చింది

Update: 2016-11-29 22:30 GMT
కొణ‌తాల రామ‌కృష్ణ‌... ఏపీలో ఒక‌ప్పుడు కీల‌క నేత‌. మంత్రిగా ప‌నిచేసిన సుదీర్ఘ అనుభ‌వం. వైసీపీని వీడిన తరువాత టీడీపీలో చేరాల‌ని అనుకున్నా ఎందుక‌నో ఆగిపోయారు. ఇప్పుడు స్థానిక స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జా ఉద్య‌మాలు చేస్తూ నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. దీంతో జ‌గ‌న్ దృష్టి ఆయ‌న‌పై ప‌డింది. వైఎస్ కుటుంబంతో మంచి సంబంధాలున్న కొణ‌తాల మ‌ళ్లీ త‌మ‌తో చేరితో బాగుంటుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డుతున్నార‌ట‌.

నిజానికి తొలి నుంచి వైఎస్‌ వెంటే కొణతాల ప్ర‌యాణం సాగింది. ఆయన మరణం తర్వాత కూడా జగన్‌ వైపు నిలిచారు. అయితే కొణతాలకు బద్ధ శత్రువైన దాడి వీరభద్రరావును వైసీపీలోకి తీసుకురావడంతో జ‌గ‌న్ పై ఆయ‌న కినుక వ‌హించారు. వైఎస్ కుటుంబాన్ని తీవ్రంగా విమర్శించిన దాడి వైసీపీలోకి రావడంతో విశాఖ జిల్లాలో రాజకీయ వాతావరణం కూడా దెబ్బతింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇక లాభం లేదనుకున్న కొణతాల వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోయారు. సొంత మనిషి కొణతాల వెళ్లిపోవడమే కాదు దాడి వీరభద్రరావు కూడా జగన్‌ కు హ్యాండిచ్చారు. వెళ్తువెళ్తూ తీవ్ర విమర్శలు చేసి మరీ వెళ్లారు దాడి. కొణతాల తొలుత టీడీపీలో చేరుతారని వార్తలొచ్చాయి. కానీ టీడీపీలోని గంటా వర్గం ఆయన రాకను తీవ్రంగా అడ్డుకుంది. చంద్రబాబు కూడా కొణతాలను పట్టించుకోలేదు. దీంతో ఆయ‌న  ఉత్తరాంధ్ర స‌మ‌స్య‌ల‌పై పోరాటం మొద‌లుపెట్టారు. ఈ నేపథ్యంలో కొణతాలను తిరిగి పార్టీలోకి తీసుకురావాలని జగన్ భావిస్తున్నట్టు చెబుతున్నారు.  

కొణతాల వైసీపీని  వీడినా కూడా ఆయ‌న‌కు వైఎస్‌ కుటుంబంతో సంబంధాలేమీ దెబ్బ‌తిన‌లేదు. ఇటీవల కొణతాల భార్య కన్నుమూసిన సమయంలో వైఎస్ జగన్‌, ఆయన తల్లి విజయమ్మ కొణతాలను పరామర్శించారు. జిల్లా వైసీపీ నేతలు కూడా కొణతాలకు ఆ సమయంలో సంఘీభావంగా నిలిచారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొణతాలను తిరిగి వైసీపీలోకి తెచ్చే ప్రయత్నాలు మొదలైనట్టు చెబుతున్నారు. జ‌గ‌న్ ఇప్ప‌టికే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని... కొణ‌తాల కూడా వైసీపీలోకి మ‌ళ్లీ వెళ్లాల‌ని అనుకుంటున్నార‌ని స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News