మైనింగ్ మాఫియాను పెకిలించిన జగన్

Update: 2020-01-12 10:10 GMT
సీఎం జగన్ ఆదేశాలతో మైనింగ్ మాఫియా గుట్టు రట్టయ్యింది. గత చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఆస్తులను ఉపయోగించుకొని గుట్టు చప్పుడు కాకుండా అధికారులను మేనేజ్ చేసి కోట్ల రూపాయలు వెనకేసుకున్న మైనింగ్ మాఫియా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఒంగోలు జిల్లాలో మైనింగ్ పేరుతో దోచుకున్న 16మందిని అరెస్ట్ చేసినట్లు ఒంగోలు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వెల్లడించారు.

ఒంగోలు జిల్లాలో ముంబై మాఫియాను తలపించే రీతిలో చేసిన మైనింగ్ మోసాన్ని బయటకు తీసి నిందితుల గుట్టురట్టు చేశామని  ఎస్పీ సిద్దార్థ కౌశల్ ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థీకృత నేరంగా మారిన కేసు అద్దంకి స్టేట్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ వీపీ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగు చూసిందని ఎస్పీ తెలిపారు.

ఒంగోలులో మైనింగ్ పేరుతో నాటి కొందరు వ్యాపారులు నకిలీ ఫారంలతో 290.49కోట్ల రూపాయల వ్యాపారం చేసి ప్రభుత్వానికి 52.20కోట్ల పరిహారం ఎగ్గొట్టారని.. అద్దంకి టాక్స్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మైనింగ్ లీజును దుర్వినియోగం చేసి మార్టూరు పరిసర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కు పాల్పడ్డ నిందుతుల నేరం వెలుగుచూసింది. మొత్తం గుట్టు విప్పితే ఇదో  పెద్ద నేరంగా వెలుగుచూసింది.

ఒంగోలులో మైనింగ్ పేరుతో దోచుకున్నారని.. ప్రభుత్వానికి ట్యాక్స్ లు కట్టకుండా.. జీఎస్టీ, మైనింగ్ బిల్లులకు సంబంధించి రూ.300 కోట్ల నష్టం వాటిల్లిందని.. బిల్లులు లేకుండా తరలి వెళ్లిన సరుకు విలువ ఏకంగా 900 కోట్లపైనే ఉంటుందని ఎస్పీ వెల్లడించారు.  ఈ కేసులో ఇంకా 122మంది నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్పీ తెలిపారు.

ఈ ఒంగోలు మైనింగ్ మాఫియాలో నేరం చేసిన ఒక్కరిని కూడా వదిలిపెట్టవద్దని సాక్షాత్తూ సీఎం జగన్ ఆదేశించారని.. అందుకే ఈ కేసు ఛేధించేందుకు సిట్ కష్టపడిందని తెలిపారు.


Tags:    

Similar News