ఇమేజి భంగం : నాలిక్కరచుకున్న జగన్

Update: 2015-10-17 04:17 GMT
అమరావతిలో రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి తనకు ఆహ్వానం పలకవద్దంటూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాయడం పూర్తిగా తొందరపాటుతో కూడుకున్నదేనా? సీనియర్ పార్టీ నేతల సలహాను పెడచెవిన పెట్టి మరీ జగన్ ఇలా బాబుకు లేఖ రాసి ఉంటారని భావిస్తున్నారు. పైగా ఆహ్వానం పంపకముందే నన్ను ముగ్గులోకి లాగద్దు అంటూ జగన్ తప్పుకోవడం అసాధారణ స్పందనే తప్ప దాంట్లో ఎలాంటి హేతువూ లేదనిపిస్తోంది. దీనివల్ల ఇమేజికి నష్టం జరిగినట్లుగా రిపోర్టులు వస్తుండడంతో జగన్ నాలిక్కరచుకున్నప్పటికీ.. బింకంగా.. ఉన్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా ఎవరైనా ఏదైనా కార్యక్రమానికి రాకూడదనుకుంటే ఆహ్వానం అందాక నేరుగా బహిరంగంగానే ఆ విషయం ప్రకటిస్తారు. పైగా రాజధాని శంకుస్థాపనకు రావడానికి, రాకపోవడానికి జగన్‌ కి సంపూర్ణహక్కులున్నాయి. ఆహ్పానం అందుకున్నాక తానెందుకు హాజరు కాలేకపోతున్నాను అనే విషయాన్ని ప్రజలకు నేరుగా జగన్ వివరించి ఉండవచ్చు. రైతుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి తాను రాలేనని చెప్పవచ్చు. అంతేకాని తనకు ఆహ్వానం పంపవద్దని చంద్రబాబుకు ముందుగానే జగన్ లేఖరాయడం హాస్యాస్పదంగా ఉందని రాజకీయ పరిశీలకుల వ్యాఖ్య.

ఏ రకంగా చూసినా ఆ లేఖ జగన్ రాజకీయ అపరిపక్వతనే బయటపెట్టిందని, దీనివల్ల ఎలాంటి రాజకీయ ప్రయోజనం రాదని, పైగా టీడీపీ నేతలు అతడిపై దాడులు ప్రారంభించి రాజకీయ ప్రయోజనాన్ని జగన్ నుంచి లాగేసుకుంటారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే శుక్రవారం వైఎస్సార్సీపీ తన అధినేత లేఖ రాయడాన్ని పూర్తిగా సమర్థించుకుంది. అమరావతి శంకుస్థాపనకు హాజరు కావద్దనేది మా ఉద్దేశం కాదు. ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూమిని లాక్కుంటోంది. అలాంటి కార్యక్రమంలో మేము భాగం కాదల్చుకోలేదు. రైతులు సంతోషంగా  లేనప్పుడు మేం ఎలా పాల్గొంటాం అని వైకాపా ప్రతినిధి పార్థసారథి సమర్థించుకున్నారు.

కారణాలు ఏవైనా, ఎవరి సమర్థనలు వారికున్నా ఆహ్వానం ఇంకా పంపకముందే అలా మొహం మీద గుద్దినట్లు చెప్పడం సంప్రదాయబద్దం కాదని, లేఖ రాసేముందు జగన్ కాస్త ఆలోచించి ఉంటే బాగుండేదని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. కాని రాజధాని శంకుస్థాపన మొత్తంగా రాజకీయ ప్రదర్శనే అయినప్పుడు ఎవరి రాజకీయ ప్రాధాన్యతలు వారికుంటాయి తప్ప సామాన్యులు ఆలోచించినట్లు నేతలు వ్యవహరించరు కదా అనే వాదనా వినిపిస్తోంది. పైగా చంద్రబాబు ఏకపాత్రాభినయానికి రాజధాని శంకుస్తాపన వేదిక నిదర్శనంగా నిలుస్తున్నప్పుడు జగన్ అక్కడికి వెళ్లి తమాషా చూడటం సాధ్యం కాదు కదా..

Tags:    

Similar News