క‌ర్ణాట‌క‌పై జ‌గ‌న్ రియాక్ష‌న్ ఇది!

Update: 2018-05-20 04:15 GMT
నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్న క‌ర్ణాట‌క రాజ‌కీయం మీద ఏపీ విప‌క్ష నేత‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తాజాగా రియాక్ట్ అయ్యారు. శ‌నివారం ఆయ‌న ట్విట్ట‌ర్ లో త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశారు. క‌ర్ణాట‌క‌లో మాదిరి ఏపీలోనూ రాజ్యాంగ ఉల్లంఘ‌న‌లు చోటు చేసుకుంటున్నాయ‌ని.. గ‌డిచిన నాలుగేళ్లుగా ఏపీలో ఇలాంటి ప‌రిస్థితి ఉంద‌ని గుర్తు చేశారు.

జ‌గ‌న్ ఏమ‌ని ట్వీట్ చేశార‌న్న‌ది చూస్తే..

క‌ర్ణాట‌క ఎపిసోడ్ ముగిసింది. రాజ్యాంగం గెలిచింది. అంత‌కంటే ఘోరంగా రాజ్యాంగ ఉల్లంఘ‌న‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో గ‌త నాలుగేళ్లుగా కొన‌సాగుతున్నాయి. ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయ‌టానికి య‌త్నించారంటూ క‌ర్ణాట‌క‌లో బీజేపీపై ఆరోప‌ణ‌లు వ‌స్తే.. ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇక్క‌డ ఏకంగా 23 మంది ఎమ్మెల్యేల‌ను సంత‌లో ప‌శువుల మాదిరిగా కొనుగోలు చేశారు. తానెంత అప్ర‌జాస్వామిక వాదో నిరూపించారు.

అందులో న‌లుగురిని మంత్రులుగా కూడా చేసి రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు. వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టం కింద చ‌ర్య తీసుకోవాలంటూ అసెంబ్లీ స‌మావేశాల‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  బ‌హిష్క‌రించినా చ‌ర్య‌లు లేవు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేని న‌ల్ల‌ధ‌నంతో కొనుగోలు చేస్తూ ఆడియో.. వీడియో టేపుల‌తో అడ్డంగా దొరిక‌పోయారు చంద్ర‌బాబు.

రాజ్యాంగం.. ప్ర‌జాస్వామ్య విలువ‌ల గురించి అలాంటి వ్య‌క్తి మాట్లాడ‌టం సిగ్గుచేటు. క‌నీసం క‌ర్ణాట‌క‌లో త‌ప్పు అని తెలిసి.. అల్ల‌రి అవుతుందేమోన‌ని వెన‌క‌డుగు వేశారు. కానీ.. ఇక్క‌డ త‌ప్ప‌ని తెలిసినా.. అల్ల‌రి అవుతుంద‌ని తెలిసినా నిస్సిగ్గుగా ముంద‌డుగు వేశారు. క‌ర్ణాట‌క ఎపిసోడ్ త‌ర్వాత ఇప్ప‌టికైనా దేశంలోని ప్ర‌జాస్వామ్య వాదులు.. రాజ్యాంగ నిపుణులు.. మీడియా దృస్టి పెట్టాల్సిన అంశం ఇదే అంటూ జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.
Tags:    

Similar News