పవన్ పై జ‘గన్’ ఫైరింగ్ పక్కానట

Update: 2016-11-06 04:41 GMT
భావోద్వేగ అంశాలు ప్రభావితం చేసినంత బాగా మరేవి ప్రజల్ని ప్రభావితం చేయలేవు. అందుకే.. అలాంటి అంశాలు ఉన్నప్పుడు రాజకీయ నేతలు చెలరేగిపోతుంటారు. భావోద్వేగ అంశాలతో ఎలాంటి రాజకీయాలు చేయొచ్చన్న విషయం తెలుగు ప్రజలకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదని చెప్పాలి. ఇలాంటి విషయాల్ని తమకు అనుకూలంగా మార్చుకొని.. రాజకీయంగా ఎంత బలమైన శక్తిగా అవతరించాలన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత.. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన మాటలతో.. చేతలతో చేసి చూపించారు.

రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇద్దరు చంద్రుళ్లు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులయ్యారు. భావోద్వేగ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కేసీఆర్ సీన్లో ఉన్నప్పుడు.. ఆ తరహా రాజకీయాలు చేయటం మరెవరికీ సాధ్యం కాదనే చెప్పాలి. ఇక.. అలాంటి అవకాశాలు విపక్షాలకు ఇవ్వకూడదన్న సోయి ఆయనకు ఎక్కువే. అందుకే.. అలాంటివి ఏమైనా తెర మీదకు వచ్చినా.. రెండు అడుగులు వెనక్కి వేసి మరీ.. సానుకూలంగా స్పందించి.. ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునేలా వ్యవహరిస్తుంటారు కేసీఆర్.

అయితే.. ఇలాంటివి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాస్త తక్కువనే చెప్పాలి. అందుకే.. ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఒక భావోద్వేగ అంశంగా మారింది. విభజన సమయంలో రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రకటించటం.. దాన్ని తాజాగా ప్రధానిగా వ్యవహరిస్తున్న మోడీ నో అంటే నో చెప్పేశారు. ఆయన తీరుపై సీమాంధ్రుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. విభజన పేరుతో తమను మోసం చేయటమే కాదు.. హోదా విషయంలో తమకు హ్యాండ్ ఇవ్వటంపై వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

మోడీ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకించటం ద్వారా తమ అభిప్రాయాన్ని మోడీకి తెలిసేలా చేస్తారని చంద్రబాబుపై సీమాంధ్ర ప్రజలు చాలానే ఆశలు పెట్టుకున్నారు. కానీ.. ఆ దిశగా ఆయన అడుగులు వేయని పరిస్థితి. తనకున్న పరిమితుల్లో మోడీకి ఏ మాత్రం ఇష్టం లేని ప్రత్యేక హోదా కోసం పోరాడే కన్నా.. వారిచ్చిన ప్యాకేజీని సరిపెట్టుకోవాలన్న భావన బాబులో కనిపించింది. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ఏపీ విపక్ష నేత జగన్ అలెర్ట్ అయ్యారు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న జగన్.. హోదాపై తన గళాన్ని వినిపించటం మొదలెట్టారు.

హోదా విషయంపై జగన్ తో పాటు.. తీవ్రంగా ప్రశ్నిస్తున్న నేతగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను చెప్పాలి. ప్రత్యేక హోదా విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తానని చెప్పిన ఆయన.. గడిచిన కొద్ది రోజులుగా ఈ అంశంపై ఆయనసీరియస్ గా వర్క్ చేస్తున్నారు. తిరుపతి సభతో మొదలెట్టి.. కాకినాడ సభలో మరింత వేడి పుట్టించిన ఆయన.. అనంతపురంలో ప్రత్యేక హోదా మీద తన పోరాటం దీర్ఘకాలికమని.. దాన్ని సాధించే వరకూ వెనక్కి తగ్గేది లేదన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేయనున్నారు పవన్.

హోదా మీద సందర్భానికి తగ్గట్లుగా నిరసనలు నిర్వహించిన జగన్.. పవన్ ఎంట్రీతో కాస్త జాగ్రత్త పడుతున్నారు. తరచూ హోదా మీద మాట్లాడేందుకు వీలుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హోదా సాధన ఉద్యమం తన ఖాతాలో వేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా విశాఖపట్నంలో ఆయన.. జైఆంధ్రప్రదేశ్ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.

తాజాగా నిర్వహించనున్న ఈ సభలో హోదా అంశంపై ఆయన పవన్ పై విమర్శలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. హోదా సాధన గోదాలోకి దిగిన పవన్ ను నేరుగా ఢీ కొనేందుకు ఆయనీ సభను వాడుకునే వీలుందని చెబుతున్నారు. హోదా గోదాలో ఛాంపియన్ గా తాను మాత్రమే నిలవాలని తలపోస్తున్న జగన్.. తనకు పోటీగా ఉన్న పవన్ పై  పైచేయి సాధించేందుకు వీలుగా కొన్ని వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే.. హోదా సాధాన పేరుతో జరుగుతున్న నిరసనల్లో అధిక్యత అంశం తెర మీదకు వచ్చినట్లుగా చెప్పొచ్చు. మరి.. ఇప్పుడు వినిపిస్తున్న అంచనాలకు తగ్గట్లుగా జగన్ పవన్ పై ఫైర్ అవుతారా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News