జగన్ ను అవమానించి వెనక్కి పంపిన పోలీసులు

Update: 2017-01-26 17:26 GMT
ప్రజల ఆకాంక్షకు అవమానమా? కోట్లాది కలల సాకారానికి ప్రయత్నిస్తే ఘోర పరాభవమా? లాంటి సందేహాలు.. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ కు విశాఖ ఎయిర్ పోర్ట్  ఎపిసోడ్ ను చూస్తే రాక మానదు. ప్రత్యేక హోదా కోసం నిర్వహిస్తున్న శాంతి ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన జగన్ పట్ల ఏపీ పోలీసులు దారుణంగా వ్యవహరించటమే కాదు.. ఆయన్ను అవమానించి మరీ వెనక్కి పంపారు.

విమానం దిగి రన్ వే మీద ఉన్న విపక్ష నేతను పోలీసు బలగాలు అడ్డుకోవటమే కాదు.. ఆయన్ను అక్కడికక్కడే వెనక్కి పంపేందుకు జరిగిన ప్రయత్నం చూసినప్పుడు నోట మాట రాదంతే. విమానాశ్రయం బయటకు రానివ్వకపోవటాన్ని అర్థం చేసుకున్నా.. రన్ వే మీద నిలబెట్టి.. వెనక్కి వెళ్లిపోవాలంటూ ఒత్తిడి చేయటం.. డొమెస్టిక్ ప్రయాణికులు వెళ్లే రహదారిని మూసేసిన వైనం చూస్తే మరీ ఇంత దారుణమా అనిపించకమానదు. ఎందుకంటే.. జగన్ ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వెళితే.. పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందనే అనుకుందాం.

అలాంటి సమయాల్లో విపక్ష నేతను సాదరంగా లాంజ్ లో కూర్చోబెట్టి.. నిరసనకు అనుమతి లేదని.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారతాయన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పి.. ఆయన్ను వెనక్కి తిరిగి వెళ్లాలని చెబితే కాదనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే.. ఏ అధినేత కూడా పోలీసులపై విరుచుకుపడాలని చూడరు. కానీ.. అవమానించటమే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు పోలీసులు ఎలా వ్యవహరిస్తారన్నది విశాఖఎయిర్ పోర్ట్ ఎపిసోడ్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

ఎయిర్ పోర్ట్ లాంజ్ లోకి కూడా అనుమతించకుండా రచ్చ రచ్చ చేసిన పోలీసులపై జగన్ సీరియస్ అయి.. రన్ వే మీద బైఠాయించటంతో అధికారులు కాస్తంత వెనక్కి తగ్గారు. చివరకు తాము అనుకున్నట్లే.. ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు రానివ్వకుండా.. జగన్ ను.. ఆయన అనుచరుల్ని మరో విమానంలో వెనక్కి పంపారు. అనుమతి లేదని చెప్పి వెనక్కి పంపొచ్చు. కానీ.. అవమానించి మరీ వెనక్కి పంపాల్సిన అవసరం ఉందా? అన్నదే అసలు ప్రశ్న. విపక్ష నేత హోదాలో ఉన్న వ్యక్తిని అవమానించాలన్న ఏపీ అధికారపక్ష తీరు చూస్తే.. రాజకీయాలు మరీ ఇంతలా దిగజారిపోతాయా? అన్న భావన కలగక మానదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News