జగన్ సర్కార్ సంచలన ఆర్డినెన్స్.. అందులో ఏముందంటే?

Update: 2020-02-21 04:36 GMT
ఏపీలోని జగన్ సర్కారు కీలక అంశాలతో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. పంచాయితీరాజ్ శాఖకు చెందిన ఈ ఆర్డినె్స్ ఇటీవల కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించింది కావటం గమనార్హం. అసెంబ్లీ ప్రోరోగ్ అయిన వేళ.. ఆర్డినెన్స్ జారీ చేసిన జగన్ సర్కారు.. తర్వాత దీన్ని అసెంబ్లీలో బిల్లు రూపంలో తీసుకు రానుంది.

డబ్బు.. మద్యం ప్రభావం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ఏపీ సర్కారు అందుకు తగ్గట్లే నిర్ణయం తీసుకుంది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. తాజాగా జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. పంచాయితీ.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభ పెట్టే చర్యల్ని నివారించేందుకు అనువుగా సవరణలు చేయనున్నారు.

స్థానిక ఎన్నికల్లో డబ్బు.. మద్యంతో అభ్యర్థులు పట్టుబడితే మూడేళ్ల శిక్ష విధించటం తో పాటు పోటీకి అనర్హులుగా ప్రకటిస్తారు. గతంలో అక్రమాలకు పాల్పడితే మూడు నెలల నుంచి ఆర్నెల్ల వరకూ మాత్రమే శిక్షలు ఉండేవి. ఇప్పుడు పదవి నుంచి తొలగించటంతో పాటు గరిష్ఠంగా మూడేళ్లు జైలుశిక్ష.. రూ.10వేలు జరిమానాను విధిస్తారు.

అంతేకాదు.. సర్పంచ్ లు స్థానికంగా ఉండటం తో పాటు పారిశుద్ధ్యం.. పచ్చదనం బాధ్యత కూడా వారి మీదే ఉంచనున్నారు. పంచాయితీ ఎన్నికల్లో ప్రచార గుడువు ఐదు రోజులు.. ఎంపీటీసీ.. జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రచార గడువు ఏడు రోజులుగా నిర్ణయిస్తూ ఇటీవల మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణం గానే తాజా ఆర్డినెన్స్ ను రూపొందించారు.
Tags:    

Similar News