వచ్చే ఎన్నికల్లో జగన్ నినాదం... ?

Update: 2021-10-17 10:00 GMT
ఏపీలో ఇపుడు ఎటు వైపు చూసినా ఎన్నికల వాతావరణం  కనిపిస్తోంది. అధికార ప్రతిపక్షాలు ముందుగానే రంగంలోకి దూకుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తెర వెనక కసరత్తుని ముమ్మరం చేశాయి. మరి కొద్ది నెలల్లో 2022 వస్తుంది. దాంతో పాటే ఎన్నికల కోలాహలం కూడా  ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల కోసం ఎవరికి వారు సరికొత్త నినాదాలు రెడీ చేసి పెట్టుకుంటున్నారు. ప్రజలకు ఆకర్షణీయమైన నినాదాలు ఉంటేనే  విజయం సాధిస్తామన్నది అధినాయకుల నమ్మకం. గత ఎన్నికల్లో ప్రత్యేక హోదా, ఏపీకి  న్యాయం అంటూ నినదించి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఈసారి మాత్రం హోదాను పక్కన పెట్టేసినట్లే కనిపిస్తోంది.

ఏపీలో అభివృద్ధి మీద విపక్షాలు వచ్చే ఎన్నికల్లో వైసీపీని టార్గెట్ చేస్తారని ఆ పార్టీ వ్యూహకర్తలకు తెలుసు. అందుకే తమ నినాదాన్ని కూడా దానికి తగినట్లుగానే మార్చేస్తున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ నినాదం ఏంటి అంటే మూడు రాజధానులు, మూడు ప్రాంతాల అభివృద్ధి. నిజానికి ఇది వైసీపీ ఎన్నికలు అయి అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోనే ప్రకటించింది. దీని మీద రెండు సార్లు అసెంబ్లీ, శాసనమండలి సమావేశం జరిపి మరీ చట్టం చేసింది. అయితే ఆ చట్టం న్యాయ సమీక్ష ముందు ఉంది. హై కోర్టులో తీర్పు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు.

ఒకవేళ తీర్పు వచ్చినా ఇక్కడ ఓడిన వారు సుప్రీం కోర్టులో కచ్చితంగా సవాల్ చేస్తారు. మరి అక్కడ తీర్పు కూడా వచ్చే వరకూ చూడాలీ అంటే 2024 ఎన్నికలే వచ్చేస్తాయి. దాంతో వైసీపీ అధినాయకత్వం ఇపుడు ఒక నిర్ణయానికి వచ్చింది. మరో రెండున్నరేళ్లలో ఎటూ అద్భుతాలు జరిగిపోవు, మూడు రాజధానుల అంశం కూడా ఇప్పట్లో  సాకారం కాదు, కాబట్టి అదే తమ ఎన్నికల నినాదంగా చేసుకుని బరిలోకి దిగాలని అనుకుంటోంది. అంటే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే తప్పకుండా మూడు రాజధానుల కలను తాము నెరవేరుస్తామని వైసీపీ చెబుతుంది అన్న మాట. అంతే కాదు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కోసమే ఈ నినాదం అంటూ విపక్షాలను ఇరుకున పెట్టనుంది అంటున్నారు.

ఇక మూడు రాజధానులను తాముఇ 2020లోనే చట్టం ద్వారా తీసుకువస్తే విపక్షాలు మరీ ముఖ్యంగా టీడీపీ దీని మీద కోర్టుకు వెళ్ళి అడ్డుకుందని కూడా వైసీపీ చెప్పబోతోంది అంటున్నారు. అంటే మూడు రాజధానులు ఏర్పడకపోవడానికి, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందకపోవడానికి కారణం టీడీపీయే అంటూ ఆ పార్టీని బోనులో నిలబెడుతుందన్న మాట. మూడు రాజధానుల విషయంలో టీడీపీ జనాలకు జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యతను కూడా పెడుతుంది. మరి దీనికి టీడీపీ కానీ ఇతర పక్షాలు కానీ ఎలా రియాక్ట్ అవుతాయి, జనాలకు ఎలా కన్వీన్స్ చేస్తాయి అన్నది చూడాలి. మొత్తానికి వైసీపీ బ్రహ్మాండమైన ప్లాన్ తోనే వచ్చే ఎన్నికలలో ఢీ కొట్టబోతోంది అంటున్నారు.
Tags:    

Similar News