టీటీడీ బోర్డులో 25 మంది... ఎవరెవరంటే?

Update: 2019-08-28 15:15 GMT
కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ పాలనా వ్యవహారాలు చూసుకునే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు కూర్పునకు సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బుధవారం ఉదయం టీటీడీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న వైవీ సుబ్బారెడ్డి... అమరావతిలో జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బోర్డులో ఎవరెవరికి చోటు కల్పించాలన్న విషయంపై కీలక చర్చ జరగగా.... అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న బోర్డు కూర్పునకు సంబంధించి జగన్ తుది నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. బోర్డు కూర్పుపై జగన్ నిర్ణయం తీసుకున్న దరిమిలా... అందుకు సంబందించిన అదికారిక ఉత్తర్వులు ఏ క్షణాన్నైనా విడుదలయ్యే అవకాశాలున్నాయి.

బోర్డులో జగన్ ఎవరెవరికి అవకాశం కల్పించారన్న విషయానికి వస్తే... తిరుపతి - చంద్రగిరి ఎమ్మెల్యేలుగా ఉన్న భూమన కరుణాకరరెడ్డి - చెవిరెడ్డి భాస్కర రెడ్డి లకు బోర్డులో స్థానం కల్పించనున్నారట. ఇక మిగిలిన సభ్యుల విషయానికి వస్తే... నిన్నటి నుంచి ప్రచారంలో ఉన్న మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావుతో పాటుగా తమిళనాడు కోటాలో ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్ కు కూడా టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారట. ఇక భూమన - చెవిరెడ్డిలతో పాటు వైసీపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి - కన్నబాబులకు కూడా బోర్డులో చోటు కల్పించారట.

తెలంగాణ కోటాలో రామేశ్వరరావుతో పాటు కొండా రాఘవరెడ్డితో పాటు వైసీపీ వ్యవస్థాపకుడిగా - పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించిన శివ కుమార్ కు కూడా బోర్డులో సభ్యత్వం ఇచ్చేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారట. ఈ పేర్లు ఇప్పటిదాకా బయటకు రాగా... మిగిలిన వారి పేర్లు అధికారిక ఉత్తర్వులు బయటకు వచ్చాక గానీ బయటపడే అవకాశాలు లేవన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే... భూమన కరుణాకరరెడ్డ గతంలో టీటీడీ చైర్మన్ గా వ్యవహరించారు. జగన్ తండ్రి - దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భూమన టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే బోర్డు చైర్మన్ గా వ్యవహరించిన భూమన...ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కోటాలో బోర్డులో సభ్యుడిగా వ్యవహరిస్తారు.

ఇక ఇప్పటిదాకా టీటీడీ బోర్డులో సభ్యుల సంఖ్య 15గానే ఉండేది. అయితే జగన్ మాత్రం ఈ సంఖ్యను ఒకేసారి 25కు పెంచేశారు. ఇప్పటికే పలు కీలక నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన జగన్... టీటీడీ బోర్డు కూర్పునకు సంబంధించి చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నట్లుగా సమాచారం. పలు వర్గాల నుంచి జగన్ కు సిఫారసులు రాగా... వాటన్నింటిపై కూలంకషంగా చర్చించిన మీదట జగన్ బోర్డు సభ్యుల సంఖ్యను పెంచితే తప్పించి అందరికీ న్యాయం చేసే అవకాశం లేదన్నట్లుగా బావించినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా బోర్డు సభ్యుల సంఖ్యను 25కు పెంచడంతో పాటుగా మైహోం రామేశ్వరరావు, ఎన్. శ్రీనివాసన్ లను బోర్డులో సభ్యులుగా ఎంపిక చేసి సంచలనం రేపారన్న వాదన వినిపిస్తోంది.

   

Tags:    

Similar News