బాబు ఆయువుప‌ట్టును టార్గెట్ చేసిన జ‌గ‌న్‌!

Update: 2019-05-30 17:30 GMT
తెలివి ఏ ఒక్క‌డి సొత్తు కాద‌ని ఊరికే చెప్ప‌రు. కాలం క‌లిసి రాన‌ప్పుడు ఎంత తెలివైనోడైనా చేత‌కాని వాడిగా.. ఫెయిల్యూర్ లా నిలిచిపోతారు. అలాంటి వారి చేతికి ఒక్క స‌క్సెస్ వ‌స్తే.. తామేంటో చేసి చూపిస్తారు. తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అదే తీరును ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ప్ర‌త్య‌ర్థుల అంచ‌నాల‌కు ఏ మాత్రం అంద‌నంత భారీ ప్లానింగ్ త‌న‌లో ఉంద‌న్న విష‌యాన్ని త‌న తాజా 30 నిమిషాల ప్ర‌సంగంలోనే చెప్పేశార‌ని చెప్పాలి.

రాజ‌కీయంగా ఇవాల్టి రోజున ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ లాంటివి సాధార‌ణ‌మ‌య్యాయి. కానీ.. అలాంటివి చేస్తే.. త‌న‌ను ఛీత్క‌రించుకోవ‌టం ఖాయ‌మ‌న్న విష‌యాన్ని అర్థం చేసుకున్న జ‌గ‌న్‌.. చాలా తెలివైన ప్లాన్ ఒక‌టి చేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో కాంట్రాక్టుల మీద రివ‌ర్స్ టెండ‌రింగ్ చేసి అవినీతి లెక్క‌లు తేలుస్తామ‌న్న‌జ‌గ‌న్‌.. అదే సూత్రాన్ని ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు అమ‌లు చేశార‌ని చెప్పాలి.

నేత‌లపై ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను ప్ర‌ద‌ర్శించ‌టం కాదు.. రివ‌ర్స్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను అమ‌లు చేయాల‌ని జ‌గ‌న్ ప్లాన్ చేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది. గ్రామ సేవ‌కులు..గ్రామ సెక్ర‌టేరియ‌ట్లు అంటూ 5.6లక్ష‌ల ఉద్యోగాల్ని రానున్న ఆర్నెల్ల వ్య‌వ‌ధిలో భ‌ర్తీ చేస్తానంటూ చేసిన ప్ర‌క‌ట‌న మామూలు ప్లానింగ్ కాదు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే బాబు ఆయువు ప‌ట్టు మీద జ‌గ‌న్ టార్గెట్ చేసిన‌ట్లుగా చెప్పాలి.

గ్రామాల్లో బ‌లంగా ఉండే టీడీపీ క్యాడ‌ర్ ను త‌న‌వైపు తిప్పుకోవ‌టానికి.. త‌న ప‌ట్ల సానుకూల‌త పెంచుకోవ‌టానికి వీలుగా తాజా ప‌థ‌కాన్ని అమ‌లు చేయాల‌న్న‌ది అస‌లు ఉద్దేశంగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ ప‌థ‌కాల గురించి ప్ర‌స్తావించిన‌ప్పుడు జ‌గ‌న్ కొన్ని అంశాల్ని అదే ప‌నిగా ప్ర‌స్తావించ‌టం క‌నిపిస్తుంది. తాము కులం.. మ‌తం.. ప్రాంతం.. వ‌ర్గం.. రాజ‌కీయం అన్న‌ది చూడ‌మ‌ని.. అంద‌రికి అవ‌కాశం ఇస్తామ‌ని చెప్పారు. ఇదే.. జ‌గ‌న్ అస‌లు ప్లానింగ్ గా చెప్పాలి.

నువ్వు మా పార్టీలో చేరు.. అందుకు ఫ‌లానా తాయిలం ఇస్తాన‌ని చెబితే ఎవ‌రైనా త‌ప్పు ప‌డ‌తారు. అన‌వ‌స‌ర విమ‌ర్శ‌ల‌కు తెర తీసిన‌ట్లు అవుతుంది.అలా కాకుండా ప్ర‌భుత్వం త‌ర‌ఫున 5.60ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తాం.. అది కూడా ఎలాంటి వివ‌క్ష లేకుండా అన్న‌ప్పుడు.. ప్ర‌భుత్వ ఉద్యోగానికి ఏ పార్టీ వారైనా అప్లై చేస్తారు. జ‌గ‌న్ చెప్పిన‌ట్లు.. ఎలాంటి వివ‌క్ష లేకుండా గ్రామ‌స్థాయిలో అంద‌రికి అవ‌కాశాలు క‌ల్పించిన‌ప్పుడు.. ప్ర‌త్య‌ర్థి పార్టీ వారిలో జ‌గ‌న్ ప‌ట్ల సానుకూల‌త పెరుగుతుంది. అదే జ‌రిగితే.. తాము అభిమానించే పార్టీపై అంతో ఇంతో  సానుకూల‌త త‌గ్గుతుంది. ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ చెప్పిన‌ట్లుగా ప‌థ‌కం విజ‌య‌వంతంగా అమ‌లు చేసిన‌ప్పుడు.. ప్ర‌త్య‌ర్థి పార్టీ అన్న ప‌క్ష‌పాతం లేకుండా వ్య‌వ‌హ‌రిస్తే.. జ‌గ‌న్ ప‌ట్ల సానుకూల‌త పెర‌గ‌టంతోపాటు.. ఆయ‌న వైపు తిరిగినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌ని లేదు. అది కూడా ఈ మార్పు గ్రామ‌స్థాయిలో మొద‌లైతే.. ప్ర‌త్య‌ర్థి పార్టీ బ‌లహీన ప‌డ‌టంతో పాటు.. జ‌గ‌న్ పార్టీ అంత‌కంత‌కూ బ‌ల‌మ‌వుతుంది. అదే జ‌రిగితే.. చంద్ర‌బాబు  పార్టీకి ఆయువుప‌ట్టులాంటి గ్రామాల్లో ఉనికి స‌మ‌స్య‌గా మారుతుంది. అదే జ‌రిగితే.. బాబు ప‌ని బ్యాండ్ మేళామే!


Tags:    

Similar News