నీటి శుద్ధిలో ఇజ్రాయిల్ టెక్నాలజీపై జగన్ దృష్టి

Update: 2019-08-05 04:15 GMT
వైఎస్ కుటుంబం సంప్రదాయంగా ఏటా జెరూసలెం పర్యటనకు వెళ్తుంది. ఇది వైఎస్ హయాం నుంచే ఆనవాయితీ. జగన్ అధికారం చేపట్టాక మొదటి సారి అక్కడికి కుటుంబంతో వెళ్లారు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ మొదటి విదేశీ పర్యటన కూడా ఇదే. అయితే, ఈ పర్యటన కేవలం ఆధ్యాత్మిక పర్యటనగా జగన్ ముగించకపోవడం విశేషం. అవకాశమున్నంత మేర ప్రజోపయోగ పర్యటనగా కూడా చేశారు జగన్. ఈ రోజు కార్మిక టోపీ పెట్టుకుని - ఇన్ సర్ట్ చేసి కనిపించిన జగన్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అవి ఎక్కడివో తెలుసుకుందాం.

ఈరోజు ఇజ్రాయెల్‌ లోని హడేరా ప్రాంతంలో ఉన్న హెచ్‌2ఐడి డీశాలినేషన్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి జగన్ సందర్శించారు. ఈ ప్లాంటు ఒక అత్యాధునిక నీటి శుద్ధి ప్రక్రియకు పేరుగాంచింది. టెల్ అవీవ్‌లోని ఇండియన్ మిషన్ డిప్యూటీ చీఫ్ షెరింగ్ తో పాటు జగన్ ఈ ప్లాంటును సందర్శించారు. ప్లాంట్ అధికారులు డీశాలినేషన్ (సముద్రపు నీటిని గృహ అవసరాలకు పనికొచ్చేలా శుద్ధిచేసే ప్రక్రియ) మెకానిజం గురించి జగన్ కు వివరించారు. ఈ ప్రాజెక్టుకు నిర్వహణ తీరు - ఖర్చుల గురించి ప్లాంట్ నిపుణులు జగన్ కు కూలంకుషంగా వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ డీశాలినేటెడ్ నీటిని రుచి చూశాడు.

సముద్రపు ఉప్పు నీటిని లవణ శాతం విపరీతంగా తగ్గించి తాగు నీటి - ఇతర గృహ అవసరాలకు వాడుకునేలా చేయడం అనేది ఒక విప్లవం. మన భూమ్మీద లభ్యమయ్యే నీటిలో 90 శాతానికి పైగా ఉప్పునీరే. ఈ శుద్ధి ప్రక్రియ తక్కువ ఖర్చులో అందుబాటులోకి వస్తే తాగునీటి సమస్య అనేది ప్రపంచానికి ఉండదు.

ఉదాహరణకు సముద్రం పక్కనే ఉన్నా ప్రకాశం జిల్లాలో తాగునీటి ఎద్దడి ఎక్కువ. ఈ ప్లాంట్ అక్కడ ఏర్పాటుచేస్తే ఆ జిల్లా ప్రజల దాహార్తిని తీర్చవచ్చు. బహుశా దీర్ఘకాలిక ప్రణాళికతో జగన్ దీనిని సందర్శించారేమో. ఇదిలా ఉండగా.... ఇదే పర్యటనలో ఆయన కొన్ని వ్యవసాయ క్షేత్రాలను కూడా సందర్శించారు. అధిక దిగుబడులకు ఇజ్రాయిల్ చాలా ప్రసిద్ధి.


Tags:    

Similar News