దివ్యాంగులు ఊహించలేని కానుకను రెఢీ చేసిన జగన్

Update: 2019-11-17 04:51 GMT
ఎన్నికల వేళ ఇచ్చే హామీల్ని నెరవేర్చేందుకే ప్రజలు ఇచ్చిన ఐదేళ్లు సరిపోని పరిస్థితి. అందుకు భిన్నంగా తాను పవర్లోకి వచ్చినంతనే.. ఎన్నికల వేళలోనూ.. తాను జరిపిన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని గుర్తు పెట్టుకొని మరీ తీరుస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. ఇన్నేసి హామీలు ఇంత తక్కువ కాలంలో ఎలా అమలు చేస్తున్నారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

ఇచ్చిన హామీలే కాదు.. ఇవ్వని కొత్త పథకాల్ని తెర మీదకు తెస్తున్న జగన్ మోహన్ రెడ్డి తాజాగా మరో కొత్త పథకానికి తెర తీశారు. ఓపక్క ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వాన్ని చిరాకు పెట్టిస్తున్నా.. అన్ని వర్గాల వారిని ఆదుకునేందుకు వీలుగా ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు.

ఇందులో భాగంగా తాజాగా దివ్యాంగులకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని సిద్ధం చేసింది. దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల బైకుల్ని ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత 2500 మూడు చక్రాల బైకుల్ని ఇచ్చేందుకు వీలుగా కొత్త పథకాన్ని సిద్ధం చేశారు.

తొలివిడతలో ఇచ్చే 2500 బైకుల కోసం రూ.22 కోట్లు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఇందుకు అవసరమైన అనుమతుల్ని జగన్ సర్కారు ఇచ్చేసినట్లుగా సమాచారం. ఈ పథకానికి లబ్థిదారులు కావాలని భావించే దివ్యాంగులు.. అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ఫారాల్ని గ్రామ వలంటీర్లకు అందించాలి.

తమ ఆధార్ కార్డుతో పాటు.. అంగ వైక్యలం ఉన్నట్లుగా ప్రభుత్వం ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని తమ దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. తెల్లరేషన్ కార్డు ఉన్న వారు.. దాన్ని కూడా జత చేయాల్సి ఉంటుంది. తమకు అందిన దరఖాస్తుల అధారంగా ఎవరెవరిని లబ్ధిదారులుగా గుర్తించాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎంపికైన వారి వివరాల్ని గ్రామ పంచాయితీల్లోని నోటీస్ బోర్డులో పెట్టనున్నారు. అన్ని వర్గాల్ని ఆకట్టుకునేలా సీఎం జగన్ కు వచ్చే ఐడియాలు విపక్షాలకు వణుకుగా మారాయని చెప్పక తప్పదు.


Tags:    

Similar News