అపాయింట్‌ మెంట్‌ కోసం తొందరెందుకంటే?

Update: 2015-10-18 05:02 GMT
వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఈ రాష్ట్రానికి ప్రత్యేకహోదాను సాధించడానికి తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడదలచుకున్నారు.. ఓకే బాగానే ఉంది. రాష్ట్ర ప్రయోజనాలనే ఆయన ముఖ్యంగా ఎంచుకున్నారు.. అంతా మంచిదే. ఆయన చేసిన దీక్షను రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేసేసింది.. వారు దుర్మార్గంగా వ్యవహరించారనే అనుకుందాం. రాష్ట్రం కోసం ఒక వ్యక్తి పోరాడుతూ ఉంటే.. దానిని చూడలేకపోయారనే అనుకుందాం! సహించలేకపోయారనే అనుకుందాం. ఆనాటినుంచి జగన్‌ ప్రధాని అపాయింట్‌ మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన ఇస్తే.. తాను కలిసి హోదా కావాలని విన్నవించాలనేది జగన్‌ కోరిక.

ఇవ్వకపోతే ఢిల్లీలో మరోసారి దీక్షకు కూర్చోవచ్చు కదా అనే ఆలోచన ఆయనకు ఎందుకు రాలేదో తెలియదు.
అయితే ప్రస్తుతం అమరావతి శంకుస్థాపన కు నరేంద్రమోడీ వచ్చే సమయానికి ఆయనతో అపాయింట్‌ మెంట్‌ కావాల్సిందేనని నానా ప్రయత్నాలు చేస్తున్నారుట. వీలైతే శంకుస్థాపన వేదికను ఎక్కడానికంటె ముందు అంటే గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ లో అయినా సరే.. ఒకటి రెండు నిమిషాలైనా ప్రధానితో భేటీ కావడానికి.. ఆయన తపన పడిపోతున్నారుట. ఎయిర్‌ పోర్ట్‌ లో మీటింగ్‌ ఏమిటా అని జనం అనుకుంటారనే వెరపు కూడా లేకుండా అడుగుతున్నారుట. తిరుపతి ఎయిర్‌ పోర్ట్‌ లో వద్దు.. గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ లోనే భేటీ కావాలనేది జగన్‌ కోరికగా చెబుతున్నారు.

ఇంతకూ జగన్‌ ఎందుకింత పట్టుదలగా వెంపర్లాడుతున్నారంటే రాజకీయ వర్గాల్లో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అమరావతి శంకుస్థాపనకంటె కనీసం గంట ముందుగా అయినా కనీసం ఒక నిమిషం పాటు అయినా ప్రధాని మోడీతో మాట్లాడాలనేది జగన్‌ కోరికట. ఎందుకంటే.. ఎటూ వేదిక మీదినుంచి ప్రధాని రాష్ట్రానికి బోలెడు వరాలు ప్రకటించే అవకాశం ఉంటుంది. అందువలన ఆయన వేదిక ఎక్కడానికంటె ముందు తాను కలవగలిగితే.. తాను విన్న వించడం వల్ల మాత్రమే.. ప్రధాని ఆ మాత్రం కరుణించాడని చాటుకోవడానికి వీలుంటుందని జగన్‌ ఆశ. చంద్రబాబు హడావుడి తప్ప రాష్ట్రం గురించి ఏమాత్రం పట్టించుకోలేదని.. తాను గట్టిగా అడిగాను గనుక, విన్నవించాను గనుక, ప్రధాని కరుణించి.. పథకాలు, ప్యాకేజీలు ఇచ్చారని జగన్‌ చాటుకునే అవకాశం వస్తుంది. శంకుస్థాపన తరువాత.. అపాయింట్‌ మెంట్‌ దొరికినా ఇక ఏమీ దిక్కుండదు. అసలు హోదా అడిగినా రాదు గనుక.. తన భేటీకి విలువ ఉండదు అని జగన్‌ ఆరాటపడిపోతున్నట్లుగా చెబుతున్నారు. పాపం జగన్‌కు ఎన్ని కష్టాలు వచ్చాయో కదా.
Tags:    

Similar News