జగన్ మరీ అంతగా దిగాలు పడ్డారా? 1

Update: 2016-02-27 17:30 GMT
సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పార్టీ టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావాహుల పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలా వ్యవహరించే వారో కథలు.. కథలుగా చెప్పుకునేవారు. టిక్కెట్టు మీకు కచ్ఛితమన్నా అన్న మాట నోట్లో నుంచి వస్తే.. సదరు నేతకు టిక్కెట్టు ఇచ్చే అవకాశం లేదని చెప్పేవారు. ఇదొక్కటే కాదు.. పార్టీ టిక్కెట్లను ఆశించే వారిని  రోజుల కొద్దీ వెయిట్ చేయించటం.. తీరా కలిసిన తర్వాత.. టిక్కెట్టు మీదే అనుకోండి. ధైర్యంగా ఉండండి లాంటి మాటలు కూడా చెప్పే వారని చెబుతారు. అలాంటి ఆశాహులెందరికో షాక్ ఇచ్చిన జగన్ తీరుకు చాలామంది తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యారన్న మాట వినిపించేది.

స్వయంగా అధినేతే టిక్కెట్టు కన్ఫర్మ్ అన్న మాట వచ్చిన నేపథ్యంలో.. అప్పులు తెచ్చి మరీ పార్టీ తరఫున పలు కార్యక్రమాలు చేపట్టేవారు. కానీ.. అలా ఖర్చు చేసిన వారికి భిన్నంగా కొత్త ముఖం తుది జాబితాలో ఉండటంతో షాక్ తిన్న వాళ్లు ఎందరో. అలా ఊహించని షాకులిచ్చిన జగన్ కు ఇప్పుడు కోలుకోలేనంత షాక్ లో కూరుకుపోయిన దుస్థితి.  

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిన జగన్.. దిద్దుబాటు చర్యలు మొదలెట్టారు. పార్టీ నేతలతో పెద్దగా టచ్ లో ఉండకుండా.. తనదైన లోకంలో ఉండే జగన్ లాంటి వ్యక్తికి.. తాజా పరిణామాలు తీవ్ర అసహనానికి గురి చేస్తున్నాయి. పార్టీ ఎమ్మెల్యేల్ని తన కింద బంటులా చూసుకునే జగన్ కు.. ఇప్పుడు వారికే తానే స్వయంగా ఫోన్ చేసి బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి రావటం ఎంత కష్టమన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

తాను కానీ రంగంలోకి దిగకపోతే.. తనతో ఉన్న వారిలో మరికొందరు జారిపోయే ప్రమాదం ఉందని.. అదే జరిగితే.. పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుందన్న విషయాన్ని గుర్తించిన జగన్ ఇప్పుడు ప్రతిఒక్కరికి టచ్ లోకి వెళ్లే పని మొదలెట్టారు. నిజానికి ఇలాంటి పరిస్థితి జగన్ కు చాలా కొత్త. తానొక ప్రత్యేకమైన వ్యక్తినని.. తానో కారణజన్ముడిగా భావించే ఆయనకు.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఒకపట్టాన మింగుడుపడని విధంగా మారాయన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News