కిలోమీటర్లు నడిచి బడికి వెళ్లిన మనోడు.. ఇప్పుడు రోజు ఆదాయం రూ.153కోట్లు

Update: 2021-10-02 03:47 GMT
విజేతలు ఉత్తనే రారు. దాని కోసం భారీగా పోరాటం చేయాల్సిందే. సవాళ్లకు ఎదురొడ్డాల్సిందే. ఎంతో సంఘర్షణ.. అంతకు మించిన శ్రమతో పాటు.. కాలం కలిసి వచ్చినప్పుడు మాత్రమే ఊహించని రీతిలో విజయం వస్తుంది. బడికి వెళ్లటం కోసం కిలోమీటర్లు కొద్దీ నడిచి.. తాగే నీటి కోసం పెద్ద పోరాటాలే చేసినోడు.. ఈ రోజున రోజుకు రూ.153కోట్ల సంపాదనతో ప్రపంచ సంపన్నుల్లో ఒకరిగా నిలిచిన ప్రస్థానం సినిమాటిక్ గా ఉంటుంది. కానీ.. ఇది రీల్ కథ కాదు రియల్ కథ. భారత్ లో అత్యంత సంపన్నుల జాబితాలో పదో స్థానంలో నిలిచారు ‘‘జై చౌదరి’’.

సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి కరెంటు లేని ఊళ్లో దీపాల వెలుతురులో చదువు కోసం అతగాడు పడిన శ్రమ ఇప్పుడు గతం. వ్యవసాయం తప్పించి మరేమీ తెలీని ఊరు నుంచి మొదలైన అతడి ప్రస్థానం కొత్త స్ఫూర్తిని ఇస్తుంది. తాజాగా విడుదలైన ‘ఐఐఎఫ్‌ఎల్ వెల్త్-హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021’ నివేదికను చూస్తే.. ఆయన సంపద ఏడాదిలో పెద్ద ఎత్తున పెరిగింది. ఇదంతా ఆయనకు చెందిన జెడ్ స్కేలర్ కంపెనీ పుణ్యమే. సదరు కంపెనీలో ఆయనకు 42 వాతం వాటా ఉంది.

హిమాచల్ ప్రదేశ్ - పంజాబ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని పనోహ్ అనే మారుమూల గ్రామంలోని ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టారు జై చౌదరి. ఎనిమిదో తరగతి వరకు దీపపు వెలుగుల మధ్యే చదువు సాగాల్సి వచ్చింది. పదో తరగతి కోసం కిలోమీటర్లు కొద్దీ దూరాన్ని నడిచి వెళ్లేవారు. తనకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూనే ఐఐటీ వారణాషిలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు.

ఇందుకోసం ఆయనకు పలువురు సాయం చేశారు. అక్కడ చదువు పూర్తి చేసుకొని కొన్నేళ్ల పాటు పలు కంపెనీల్లో పని చేసిన అనంతరం తన భార్య జ్యోతి చౌదరితో కలిసి సెక్యూర్ ఐటీ అనే కంపెనీని ప్రారంభించారు. 2007లో జెడ్ స్కేలర్ ను ఆయన షురూ చేశారు. ఇటీవల కాలంలో సైబర్ సెక్యురిటీకి విపరీతమైన డిమాండ్ పెరగటం.. ఆయన కంపెనీ ఆ సేవల్ని అందించటంలో దిట్ట కావటంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. ఇదెంత భారీగా అంటే.. గత ఏడాది కాలంలో ఆయన సంపద 85 శాతం పెరిగింది. ఆయన సంపద రూ.1,21,600 కోట్లుగా చెప్పాలి. ఒకప్పుడు తాగు నీటి కోసం పోరాడిన వ్యక్తి ఈ రోజు లక్ష కోట్ల పైచిలుకు సంపదను క్రియేట్ చేసిన వైనం కొత్త స్ఫూర్తిని కలిగిస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News