కేసీఆర్ గ‌డ‌బిడ చెప్పేసిన జైపాల్ రెడ్డి

Update: 2018-06-27 05:42 GMT
ముఖ్య‌మంత్రి కుర్చీలో కూర్చున్న త‌ర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వ‌రం మారిపోయింది కానీ.. ఉద్య‌మ నేత‌గా ఉన్న కాలంలో జైపాల్ రెడ్డి ప్ర‌స్తావ‌న తీసుకొచ్చినంత‌నే అలెర్ట్ అయిపోయేవారు. ఆచితూచి మాట్లాడేవారు. అంత‌ర్గ‌త స‌మావేశాల్లోనే కాదు.. భారీ బ‌హిరంగ స‌భ‌ల్లోనూ జైపాల్ ఎంత గొప్పోడో చెప్పే ప్ర‌య‌త్నం చేసేవారు. అంత పెద్ద‌మ‌నిషి తెలంగాణ విష‌యంలో కాస్తంత సానుకూల‌త ప్ర‌ద‌ర్శిస్తే చాలు.. తెలంగాన వ‌చ్చేసిన‌ట్లేన‌ని చెప్ప‌టానికి ఏ మాత్రం మొహ‌మాట ప‌డేవారు కాదు.

కానీ.. ఇప్పుడదే కేసీఆర్ తాను గ‌తంలో కీర్తించిన జైపాల్ ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్య‌లు చేస్తారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.  ప‌వ‌ర్లో ఉన్న‌ప్పుడు వ‌చ్చే ఆత్మ‌విశ్వాసం అలాంటి మాట‌లు చెప్పిస్తుందే త‌ప్పించి అందులో కేసీఆర్ త‌ప్పేం లేద‌ని చెప్పాలి. తెలంగాణ రాజ‌కీయాల్లోపెద్దాయ‌న‌గా పేరున్న జైపాల్ రెడ్డి తాజాగా కేసీఆర్ బ‌ల‌హీన‌త‌ల చిట్టా విప్పారు. అంతేకాదు..త‌న బ‌లాన్ని చూసి మురిసిపోతున్న కేసీఆర్‌కు ముందుంది ముస‌ళ్ల పండ‌గ అన్న చందమ‌న్న‌ట్లు చెప్పిన జైపాల్ రెడ్డి.. అదెలానో వివ‌రించారు.

తాజాగా విలేక‌రుల‌తో మాట్లాడిన జైపాల్ రెడ్డి ఆ మ‌ధ్య కేసీఆర్ హ‌డావుడి చేసిన ఫెడ‌ర‌ల్ ఫ్‌రంట్  ఎక్క‌డ అంటూ ప్ర‌శ్నించారు. ఓవైపు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అంటూనే మ‌రోవైపు బీజేపీతో క‌లిసి ర‌హ‌స్య దోస్తీ చేస్తున్న‌ట్లుగా ఆరోపించారు. బీజేపీతో త‌న‌కున్న దోస్తానాను గుట్టుగా ఉంచేసి.. బీజేపీ.. ప్ర‌గ‌తిశీల మేథావులు.. మైనార్టీలు ఇలా అంద‌రి ఓట్ల‌ను కొల్ల‌గొట్టాల‌న్న‌ది కేసీఆర్ ప్లాన్ అని చెప్పారు.

కేసీఆర్ ఏ ప‌థ‌కాన్ని స్టార్ట్ చేసినా అది ఫెయిల్ అవుతుంద‌న్న ఆయ‌న‌.. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తామ‌న్న న‌మ్మ‌కం కేసీఆర్‌కు లేద‌న్నారు. కాంగ్రెస్ లోని అంత‌ర్గ‌త పోరుకు త‌న‌దైన భాష్యం చెప్పిన జైపాల్ రెడ్డి ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ చేశారు జాతీయ పార్టీగా కాంగ్రెస్‌లో విభేదాలు స‌హ‌జ‌మేన‌ని.. ఎన్నిక‌ల్లో మాత్రం తామంతా ఒక్క‌టై.. టీఆర్ఎస్ ప‌ని ప‌డ‌తామ‌న్నారు. త‌మ‌తో పోలిస్తే ఎన్నిక‌ల వేళ టికెట్లు ఇచ్చేట‌ప్పుడు కేసీఆరే ఎక్కువ‌గా ఇబ్బంది ప‌డ‌తార‌న్నారు. కాంగ్రెస్ లో టికెట్లు ఇచ్చిన త‌ర్వాత క‌లిసి ముందుకు వెళ‌తామ‌ని.. టీఆర్ఎస్ లో మాత్రం టికెట్లు ఇచ్చిన త‌ర్వాతే గ‌డ‌బిడ మొద‌ల‌వుతుంద‌న్నారు. సిట్టింగుల‌కు టికెట్లు ఇస్తే ప్ర‌జ‌లు ఓడిస్తార‌ని.. ఇత‌రుల‌కు టికెట్లు ఇస్తే సిట్టింగులు ఓడిస్తారన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పించింది తానేన‌ని చెప్పిన జైపాల్ రెడ్డి.. తెలంగాణ‌లో ఆట స్టార్ట్ చేసింది కేసీఆరే అయిన‌ప్ప‌టికీ గోల్ కొట్టేది మాత్రం కాంగ్రెస్ పార్టీనేన‌ని చెప్పారు. జైపాల్ రెడ్డి చెప్పిన మాట‌ల్నిచూస్తే.. కేసీఆర్ చెప్పినంత ఈజీగా ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్క‌ద‌ని.. అందునా.. ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు రాద‌న్న ఆయ‌న మాట‌ల్లో హ‌డావుడే త‌ప్పించి.. మ‌రింకే మీ లేద‌న్న మాట వినిపిస్తోంది. నిజంగానే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు వ‌చ్చే అవ‌కాశ‌మే లేకుంటే.. అలాంటి పార్టీ గురించి కేసీఆర్ అన్నేసి మాట‌లు ఎందుకంటారని.. త‌న స్థాయికి త‌క్కువ‌గా ఉన్న వారి ప్ర‌స్తావ‌న తెచ్చే వీల్లేద‌న్న మాటను రాజ‌కీయ వ‌ర్గాలు చెప్ప‌టం గ‌మ‌నార్హం.

Similar News