తెలంగాణ పెద్దాయ‌న ఇక లేరు!

Update: 2019-07-28 04:04 GMT
తెలంగాణ త‌ల్లికి పుత్ర‌శోకంగా చెప్పాల్సిందే. స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో నిజాయితీ.. న‌మ్మిన సిద్ధాంతం కోసం.. ప్ర‌జ‌ల‌కు న‌ష్టం వాటిల్ల‌కుండా ఉండేందుకు అవ‌స‌ర‌మైతే అంబానీల‌కైనా చెక్ చెప్పే ద‌మ్ము.. ధైర్యం.. తెగువ‌.. లాంటి గుణాల‌తో పాటు.. అపార‌మైన మేధోత‌నం ఉట్టిప‌డే అరుదైన వ్య‌క్తిత్వం తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయింది. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం.. కేంద్రంలో కీల‌క ప‌ద‌వుల్ని చేప‌ట్టి.. ఎలాంటి మ‌చ్చ ప‌డ‌కుండా వ్య‌వ‌హ‌రించిన జైపాల్ రెడ్డి (77) ఈ ఉద‌యం (ఆదివారం) క‌న్నుమూశారు.

కొద్దిరోజులుగా నిమోనియాతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న గ‌చ్చిబౌలిలోని ఏషియ‌న్ గ్యాస్ట్రో ఎంట్రాల‌జీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు. తెలంగాణ‌లోని ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా మాడుగుల‌లో 1942 జ‌న‌వ‌రి 16న జ‌న్మించిన ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు.. ఒక కుమార్తె ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీల‌క‌భూమిక పోషించిన జైపాల్ రెడ్డి.. యూపీఏ1.. 2ల‌లో కీల‌క‌భూమిక పోషించారు. అంబానీల‌తో పెట్టుకున్న నేప‌థ్యంలో ఆయ‌న్ను అప్రాధాన్య ప‌ద‌వికి మార్చార‌న్న ఆరోప‌ణ ఉంది. ఇదో ఎత్తు అయితే.. తెలంగాణ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసిప‌డిన రోజుల్లో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ సైతం జైపాల్ రెడ్డి గొప్ప‌త‌నం.. కేంద్రంలో ఆయ‌న‌కున్న ప‌లుకుబ‌డిని ప‌దే ప‌దే ప్ర‌స్తావించేవారు. తెలంగాణ‌ను తెచ్చే సామ‌ర్థ్యం ఉన్న నేత‌గా జైపాల్ ను ఆయ‌న అభివ‌ర్ణించారు.

జైపాల్ రెడ్డి అనుకొని.. అదే ప‌ని మీద కూర్చుంటే 24 గంట‌ల్లో సోనియ‌మ్మ చేత తెలంగాణ‌ను తేగ‌ల స‌మ‌ర్థ‌త ఉన్న ఒకేఒక్క‌డుగా జైపాల్ ను అభివ‌ర్ణించేవారు కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు త‌ర్వాత అదే జైపాల్ మీద కేసీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌టం.. విమ‌ర్శ‌ల‌తో ఉతికి ఆరేయ‌టం రాజ‌కీయంగానే చూడాలి.

వ్య‌క్తిగ‌తంగా ఎలాంటి మ‌చ్చ లేని రీతిలో ఆయ‌న రాజ‌కీయాల్ని చేశార‌ని చెప్పాలి. మాడుగుల‌.. న‌ల్గొండ జిల్లా దేవ‌ర‌కొండ‌లో జైపాల్ రెడ్డి ప్రాథ‌మిక విద్యాభ్యాసం జ‌ర‌గ్గా.. ఉస్మాయి నుంచి ఎంఏ ఇంగ్లిష్ లిట్ లో ప‌ట్టా పొందారు. విద్యార్థి ద‌శ నుంచి రాజ‌కీయాల్లో చురుగ్గా వ్య‌వ‌హ‌రించిన జైపాల్ రెడ్డి.. ఇందిరాగాంధీ అత్య‌యిక ప‌రిస్థితిని విధించిన నేప‌థ్యంలో.. ఆ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ కాంగ్రెస్ కు రాజీనామా చేసి జ‌నతాపార్టీలో చేశారు.

1985-88 వ‌ర‌కు జ‌న‌తాపార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప‌ని చేసిన ఆయ‌న‌.. 1980లోమెద‌క్ ఎంపీగా ఇందిగాంధీ మీద పోటీ చేసి ఓడారు. అయితే.. 1984లో మ‌ళ్లీ ఎంపీగా ఎన్నిక‌య్యారు. మొత్తం ఐదుసార్లు ఎంపీగా.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఆయ‌న విజ‌యం సాధించారు. 1969లో తొలిసారి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా క‌ల్వ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి విజ‌యం సాధించారు. అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాలుగుసార్లు ప్రాతినిధ్యం వ‌హించారు.

1984లో తొలిసారి ఎంపీగా గెలిచిన ఆయ‌న‌.. 1999.. 2004ల‌లో మిర్యాల‌గూడ నుంచి ఎంపీగా విజ‌యం సాధించారు. 1990 - 1996ల‌లో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎన్నికైన ఆయ‌న‌.. 1991-92 మ‌ధ్య కాలంలో రాజ్య‌స‌భ కాంగ్రెస్ ప‌క్ష నేత‌గా వ్య‌వ‌హ‌రించారు. 1999-2000ల‌లో స‌భాహ‌క్కుల ఉల్లంఘ‌న క‌మిటీ ఛైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌.. ఐకే గుజ్రాల్ మంత్రివ‌ర్గంలో స‌మాచార ప్ర‌సార శాఖ మంత్రిగా.. మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌భుత్వంలో పెట్రోలియం.. ప‌ట్ట‌ణాభివృద్ధి.. సాంస్కృతిక శాఖా మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు సంబంధించి తొలిసారి ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్ గా పుర‌స్కారం అందుకున్న నేత‌గా జైపాల్ రెడ్డికి గుర్తింపు ఉంది. ఆసుప‌త్రి నుంచి ఆయ‌న భౌతిక‌కాయాన్ని జూబ్లిహిల్స్ లోని స్వ‌గృహానికి త‌ర‌లించారు. అంత్య‌క్రియ‌లు రేపు (సోమ‌వారం) జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. జైపాల్ రెడ్డి మ‌ర‌ణంపై ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.
   

Tags:    

Similar News