ఏపీలో బీజేపీ దూకుడికి బడ్జెట్ బ్రేక్..రంగంలోకి దిగిన జైశంకర్ - సురేష్ ప్రభు?

Update: 2021-02-05 11:00 GMT
ఏపీలో ప్రస్తుతం టీడీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. వచ్చే ఎన్నికల లోపు పూర్తిగా మళ్లీ కోలుకుంటుంది అని చెప్పలేని పరిస్థితి. టీడీపీ లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నేతలు సైతం గత ఎన్నికల్లో ఓటమి పాలై , ప్రస్తుతం పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఈ సమయంలో దాన్ని క్యాష్ చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. రాష్ట్రంలో టీడీపీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అని చాటి చెప్పడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంది.

2024లో నిర్వహించబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించడంపైనే పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు.  అయితే , బీజేపీ రాష్ట్రశాఖ నాయకుల దూకుడు వైఖరికి సడన్ బ్రేకులు పడుతున్నాయి. ఒకటి- మొన్నటి కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు ఆశించిన స్థాయిలో లేకపోవడం. మరొకటి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే ప్రతిపాదనలను తీసుకుని రావడం. ఈ రెండింటికీ రాష్ట్ర ప్రజలకు సమాధానాన్ని చెప్పాల్సిన బాధ్యతను ఎదుర్కొంటోంది బీజేపీ.

బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీ వాటా ఎంత, అనే విషయాన్ని వివరించడంతో పాటు విశాఖ ఉక్కు కంపెనీ నుంచి పెట్టుబడులను ఉపసంహరించడానికి గల కారణాలను వెల్లడించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికోసం బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు మేధావుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శని, ఆదివారాల్లో ఈ భేటీలు కొనసాగబోతోన్నాయి. విజయవాడ, గుంటూరు, ఏలూరు, తిరుపతిల్లో వాటిని ఏర్పాటు చేశారు.

 విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్..రైలేశాఖ మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. విజయవాడలో నిర్వహించే మేధావుల సమావేశానికి జైశంకర్, తిరుపతిలో ఏర్పాటు చేసే భేటీకి సురేష్ ప్రభు హాజరవుతారు.

సురేష్ ప్రభు పాల్గొనబోయే మేధావుల సమావేశాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయడం వెనుక బీజేపీ వ్యూహాం ఉందనేది బహిరంగ రహస్యం. తిరుపతి లోక్‌ సభ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నికలు రానున్నాయి. బడ్జెట్‌ లో ఆశించిన విధంగా కేటాయింపులు లేవంటూ వెలువడుతోన్న వార్తలు ఈ ఉప ఎన్నికపై కొద్దో, గొప్పో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదనేది బీజేపీ నేతల అంచనా. అందుకే తిరుపతిలోనే మేధావుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, కేంద్ర మాజీమంత్రి సురేష్ ప్రభు ద్వారా వివరణ ఇప్పించాలని బీజేపీ భావిస్తుంది.

 ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయం ప్రస్తావనకు వస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. దీనికి అవసరమైన సమాధానాలు, వివరణలను సిద్ధం చేసుకుంటున్నారు. జాతీయ స్థాయిల కేంద్ర ప్రభుత్వం పెట్టబడులను ఉపసంహించుకుంటోందనే కారణాన్ని ప్రధానంగా వివరించే అవకాశం ఉందని సమాచారం. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమం కొత్తదేమీ కాదని, ఇదివరకు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలోనూ అమలు చేసిన దాన్ని గుర్తు చేయనున్నారు.
Tags:    

Similar News