మార్పుల మహారాజు కేసీఆర్.. తాజాగా ఆ శాఖ పేరు మార్చేశారు

Update: 2020-07-21 08:50 GMT
మరక మంచిదే అన్న ప్రకటనను గుర్తు చేసేలా మార్పు మంచిదే అంటూ ప్రతి విషయంలోనూ తన మార్కును వేయటం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విపరీతంగా తపిస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన.. ఇప్పటికే పలు మార్పులకు శ్రీకారం చుట్టారు.

తన ఆలోచనలకు తగ్గట్లుగా మార్పులు చేయటానికి ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఇందులో భాగంగా ఆయన చాలా కరకుగా వ్యవహరిస్తారు కూడా. సచివాలయాన్ని మార్చాలన్న ఆయన ఆలోచన కోసం.. ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా కొత్త సచివాలయాన్ని నిర్మించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగా విమర్శలు ఎదురైనా పట్టించుకోని తత్త్వం కేసీఆర్ సొంతం.

ఇదిలా ఉంటే.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో వచ్చిన మార్పు.. మారిన పరిస్థితులతో పాటు రాష్ట్రంలోని నీటి పారుదల శాఖ వికేంద్రీకరణ.. పునర్ వ్యవస్థీకరణ జరగాల్సిన అవసరాన్ని గుర్తించిన కేసీఆర్.. తాజాగా ఆ శాఖ పేరును మార్చేందుకు నిర్ణయించారు. ఇప్పటివరకూ నీటిపారుదల శాఖ పేరును మార్చాలని నిర్ణయించారు. ఇకపై ఈ శాఖను జలవనరుల శాఖగా మారుస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు.

వేలాది కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలో భారీ సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్మిస్తున్న తెలంగాణ సర్కారు.. దీని ద్వారా కోటీ పాతిక లక్షల ఎకరాలకు సాగునీటిని అందించటం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా శాఖలోని వివిధ విభాగాల్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని.. రాష్ట్రాన్ని వీలైన్ని ఎక్కువ ప్రాదేశిక ప్రాంతాలుగా విభజించాలని నిర్ణయించారు. ఇందుకు అదనంగా సిబ్బంది అవసరమైతే.. వెయ్యి వరకు పోస్టుల్ని కొత్తగా భర్తీ చేయనున్నట్లుగా కేసీఆర్ వెల్లడించారు. తాను చెప్పినట్లుగా పునర్ వ్యవస్థీకరణ.. మార్పులు పూర్తి చేయాలన్నారు. అన్ని మార్పులు అయ్యాక మరోసారి సమీక్ష పెట్టుకుందామని కేసీఆర్ ప్రకటించారు.
Tags:    

Similar News