అఫిషియ‌ల్ - 175 చోట్లా జ‌న‌సేన పోటీ, పొత్తుల్లేవు !

Update: 2018-05-01 12:00 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యం ఏదైనా  క‌న్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఒక దానిపై క్లారిటీ వ‌స్తే మ‌రో సందేహం ఆ ప‌క్క‌నే పొంచి ఉంటుంది. ప్ర‌శ్నిస్తాన‌ని ఏ ముహుర్తంలో ప‌వ‌న్ చెప్పారో కానీ.. ఆయ‌న కంటే ఎక్కువ‌గా ఆయ‌న్ను ప్ర‌జ‌లు ప్ర‌శ్నించే ప‌రిస్థితి. ఇక‌.. మీడియా సంగ‌తి అయితే చెప్పాల్సిన ప‌నే లేదు. ఏ మాత్రం క్లారిటీ లేని రీతిలో ఆయ‌న నిర్ణ‌యాలు ఉంటాయి. ఎప్పుడేం చెబుతారో.. ఎవ‌రు సీన్లోకి వ‌స్తారో ఓ ప‌ట్టాన అర్థం కాదు.

రానున్న ఎన్నిక‌ల్లో ఏపీ నుంచి ప‌వ‌న్ పోటీ చేసేది ఎన్ని స్థానాల‌న్న అంశంపై ఇప్ప‌టివ‌ర‌కూ స్ప‌ష్ట‌త లేదు. ఆ విష‌యంలో ఎవ‌రికి వారు ఏదో ఒక లెక్క వేసుకుంటున్న ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ఈ అంశం మీద క్లారిటీ ఇచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలోని 175 స్థానాల్లో పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంతేకాదు.. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కూ పార్టీ బ‌లోపేతానికి చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు వెల్డించారు.

ఈ నెల (మే) 11న ఏపీలో త‌న ప‌ర్య‌ట‌న వివ‌రాల షెడ్యూల్ విడుద‌ల చేస్తాన‌ని చెప్పిన ఆయ‌న‌.. తెలంగాణ రాష్ట్రంలో జ‌న‌సేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంద‌న్న వివ‌రాల్ని ఆగ‌స్టులో వెల్ల‌డించ‌నున్న‌ట్లు చెప్పారు. ఏపీలోని 13 జిల్లాల నుంచి వ‌చ్చిన పార్టీ కీల‌క నేత‌ల‌తో ప‌వ‌న్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారికి దేవ్ ని ప‌రిచ‌యం చేశారు. ఆయ‌న ప‌వ‌న్ కు వ్యూహ‌క‌ర్త‌గా ఉండ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు. తాను స్టార్ట్ చేసిన కామ‌న్ మ్యాన్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్ ఏర్పాటు చేసిన నాటి నుంచి దేవ్ తో త‌న‌కు అనుబంధం ఉంద‌న్నారు.

ఎన్నిక‌ల్లో పోటీ విష‌యంలో అనుభ‌వం లేద‌న్న మాట ఎవ‌రైనా అంటే బ‌లంగా తిప్పి కొట్టాల‌న్న ప‌వ‌న్‌.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌క్కా వ్యూహంతో ముందుకు వెళ్ల‌నున్న‌ట్లుగా పార్టీ నేత‌ల‌తో చెప్పారు. ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌ల‌కు.. సంస్థాగ‌త నిర్మాణ విధానాల రూప‌క‌ల్ప‌న‌కు దేవ్ పార్టీతో ఉంటార‌న్నారు. గ‌డిచిన ప‌ది నెల‌లుగా పార్టీ కోసం దేవ్ ప‌ని చేస్తున్న‌ట్లు చెప్పిన ప‌వ‌న్‌..  గ‌త కొన్ని నెల‌లుగా పార్టీ కార్య‌క్ర‌మాల రూప‌క‌ల్ప‌నలో క్రియాశీల‌క పాత్ర‌ను పోషిస్తున్నార‌న్నారు.

కామ‌న్ మ్యాన్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్ కు సంబంధించి 1200 మంది కార్య‌క‌ర్త‌లు దేవ్ టీంకు స‌హ‌కారం అందిస్తామ‌న్నారు. జ‌న‌సేన ఏ ఒక్క‌కులానికి ప్రాతినిధ్యం వ‌హించ‌ద‌ని చెప్పిన ప‌వ‌న్‌.. కులాల ఐక్య‌త త‌మ పార్టీ సిద్దాంత‌మ‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు.

ఒక కులానికి ఒక కులం ప‌ర‌స్ప‌రం ఆధారంగా నిల‌వాల‌న్న ఆకాంక్ష‌ను ప‌వ‌న్ వ్య‌క్తం చేశారు. కుల‌.. మ‌తాల సామ‌ర‌స్యం నిల‌పాల‌న్న సంక‌ల్పం జ‌న‌సేన ల‌క్ష్యంగా చెప్పారు. పార్టీలో ప్ర‌తిభావంతులైన కార్య‌క‌ర్త‌లు ఉన్నార‌ని.. బ‌ల‌మైన మేధ‌స్సులో ఉన్న వారు పార్టీలో ఉన్నార‌న్నారు. త‌మ పార్టీదో కుటుంబ‌మ‌ని.. కులానికి సంబంధించిన పార్టీ ఎంత‌మాత్రం కాద‌ని చెప్పారు. కులం.. కులం అంటూ అదే ప‌నిగా భ‌జ‌న చేసిన ప‌వ‌న్ తాజా తీరు చూస్తే.. గ‌డిచిన కొంత‌కాలంగా త‌న‌పై కులం ముద్ర వేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న వారికి కౌంట‌ర్ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లుగా స్ప‌ష్టం చేస్తున్న‌ట్లు ఉంది. అంతేకాదు.. త‌మ‌కు భారీ యంత్రాంగం ఉన్న‌ట్లుగా.. కార్య‌క‌ర్త‌ల బేస్ ఉంద‌ని చెప్ప‌టం చూస్తే.. పార్టీ నిర్మాణంలో జ‌న‌సేన వీక్ అన్న విమ‌ర్శ‌ల‌కు స‌మాధానం చెప్పే ప్ర‌య‌త్నాన్ని ప‌వ‌న్ చేసిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి.. ఇన్ని మాట‌లు చెప్పిన ప‌వ‌న్‌.. తాను చెప్పిన వాటికి సంబంధించి చేత‌ల్లో ఎంత చేసి చూపిస్తారో చూడాలి.
Tags:    

Similar News