బాబు పవన్ పొత్తు ఖాయం... కాపులు మద్దతు ఎవరికంటే...?

Update: 2022-08-07 07:30 GMT
తెలుగుదేశం పార్టీ కాపులకు ఎపుడూ వ్యతిరేకమని, ఇది చరిత్ర చెప్పిన సత్యమని వైసీపీ మంత్రి అంబటి రాంబాబు సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు కాపులకు చేసింది కూడా ఏమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఒక చానల్ కి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబటి మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద హాట్ హాట్ కామెంట్స్ చేశారు. కాపులకు టీడీపీ ఏమి చేసిందన్నది చరిత్రలో పదిలంగా ఉందని, నాడు వంగవీటి రంగా హత్య నుంచి బాబు సీఎం అయ్యాక ముద్రగడ పద్మనాభాన్ని ఏ రకంగా హింసించారు అన్నది ప్రతీ ఒక్క కాపు గుర్తుంచుకుంటారని ఆయన అన్నారు.

ఇక కాపులకు మేలు చేసింది వైఎస్సార్ అని, ఆయన తరువాత జగన్ మాత్రమే అని ఆయన అన్నారు. కాపులను వైసీపీ నుంచి వేరు చేయడం సాధ్యం కాదని అంబటి అభిప్రాయపడ్డారు. కాపులు సొంతంగా ఆలోచిస్తారని, తమను ఎవరు అన్యాయం చేశారన్నది వారికి తెలుసు అన్నారు. కాపులు పవన్ కి పూర్తిగా మద్దతుగా నిలబడతారు అని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు.

కాపులకు పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుండును అని ఉంటే ఉండొచ్చు కానీ పవన్ చంద్రబాబుకు మద్దతుగా నిలిచి ఆయన్ని సీఎం చేస్తాను అంటే వారు ఎందుకు ఓటు వేస్తారని అంబటి ప్రశ్నించారు. కాపులకు అన్యాయం జరిగినపుడు, తమ కుల పెద్దగా భావించుకున్న ముద్రగడ పద్మనాభాన్ని బాబు సర్కార్ నానా బాధలు పెడుతున్నపుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని అంబటి నిలదీశారు. ఆనాడు ముద్రగడకు సంఘీభావంగా దాసరి నారాయణరావు, చిరంజీవి, బొత్స సత్యనారాయణ, తాను వెళ్ళి మీటింగులు పెట్టామని గుర్తు చేశారు.

కాపుల మద్దతు అత్యధిక శాతం వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీయే ఉంటుందని అంబటి స్పష్టం చేశారు. 2024లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఎవరినీ బతకనివ్వరు అని పవన్ కళ్యాణ్ రాజకీయ కోణం నుంచి చూస్తే కరెక్టే అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోతే టీడీపీ జనసేన బతికి బట్టలేవని, ఆ రెండు పార్టీలూ వాటి అధినేతలు శంకరగిరి మాన్యాలు పట్టి పోవాల్సిందే అని ఆయన అన్నారు.

పవన్ కళ్యాణ్ పార్టీ వెనకాల చంద్రబాబు ఉన్నారని, ఆ సంగతి అసలైన కాపులకు తెలుసు అని అంబటి చెప్పారు. పవన్ ముమ్మాటికీ దత్తపుత్రుడే. ఆ సంగతి జగన్ కానీ తాను కానీ చెప్పనవసరం లేదని అన్నారు. 2014 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా తీసుకోకుండా జనసేన తరఫున బాబుకు మద్దతు ఇచ్చింది పవన్ కాదా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో బాబు వ్యతిరేక ఓట్లు చీలడానికి విడిగా పోటీ చేసినది ఇదే పవన్ కాదా అని అన్నారు. ఇపుడు 2024 ఎన్నికల్లో జగన్ వ్యతిరేక ఓట్లు చీలకూడదని అంటున్నరని, బాబుని సీఎం చేయడం కోసమే పవన్ జనసేన పెట్టారు అనడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ ఏమి కావాలని ఆయన అన్నారు.

పవన్ ఎంత గింజుకున్నా ఆయన బాబుకు దత్తపుత్రుడే అని అంబటి బల్ల గుద్ది మరీ చెప్పారు. ఇక ఈ రోజు ఈ రెండు పార్టీలు వేరుగా ఉన్నట్లుగా నాటకాలు ఆడుతున్నా ఎన్నికల వేళకు కలసి పోటీ చేయడం ఖాయమని కూడా అంబటి జోస్యం చెప్పారు. ఈ రెండు పార్టీలే కాదు, బాబు అనుకూల మీడియా తో పాటు ఎందరు కలసివచ్చినా కూడా జగన్ని ఏమీ చేయలేరని అంబటి అన్నారు. మళ్లీ జగన్ బంపర్ మెజారిటీతో గెలవడం ఖాయమ్ని అన్నారు.

చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు ఆయన ధనబలంతో ఉన్నప్పుడే వైసీపీ విపక్షంలో ఉంటూ 151 సీట్లు సాధించగా లేనిది ఈ రోజున బాబు వీక్ అయి విపక్షంలో ఉన్న వేళ 175 సీట్లను తాము ఎందుకు సాధించలేమని అంబటి ఎదురు ప్రశ్నించారు. విపక్షాలకు ఇది ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ తమ టార్గెట్ 175 సీట్లు గెలిచి తీరుతామని, చంద్రబాబుని కుప్పంలో ఓడించి తీరుతామని అంబటి స్పష్టం చేశారు. మొత్తానికి అటు బాబుని, ఇటు జనసేనానికి కూడా ఒకేసారి ఏకి పారేసిన అంబటి జగన్ వెంటే కాపులు అని చెబుతున్నారు.
Tags:    

Similar News