పవన్ కు అండగా గళం విప్పిన జనసైనికుడు

Update: 2020-01-31 04:15 GMT
ఒక రాజకీయ పార్టీ లో అధినేత మినహా మరెవరూ మాట్లాడకుండా ఉండటం సాధ్యం కాదు. కానీ.. అలాంటి తీరును తొలి నుంచి ప్రదర్శిస్తున్న జనసేన ఎట్టకేలకు తన తీరును మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఏం మాట్లాడినా.. ఏం చెప్పినా.. ఎవరి మీదనైనా విరుచుకుపడాలన్నా.. విమర్శలు చేయాలన్నా జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రమే చేయాలే తప్పించి.. మిగిలిన వారెవరూ నోరు విప్పకూడదన్న అప్రకటిత రూల్ జనసేనలో ఫాలో అవుతుంటారు. ఇలాంటివేళ.. ఆ తీరుకు భిన్నంగా జనసైనికుడు ఒకరు గళం విప్పారు. మాట మీద నిలకడలేనితనం పవన్ లో ఎక్కువని.. ఆయన తాజాగా సినిమాలు చేయటాన్ని తప్పు పడుతూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు గుడ్ బై చెప్పటం తెలిసిందే. పార్టీకి రాజీనామా చేసిన సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఆయన కౌంటర్ కు పవన్ రియాక్ట్ అయి.. ధీటుగా పంచ్ విసిరిన వైనం తెలిసిందే. ఇలాంటివేళ.. జనసేన నేత పోతిన మహేశ్ గళం విప్పారు. ఏం జరిగినా? ఎవరిని విమర్శించాలన్నా అధినేత మాత్రమే మాట్లాడాలన్న అప్రకటిత రూల్ ను బ్రేక్ చేశారు. రాజకీయాలంటే టీ20 మ్యాచ్ కాదని.. టెస్టు మ్యాచ్ అంటూ జేడీ లక్ష్మీనారాయణ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

రాజకీయాలంటే ఓర్పు.. సహనం.. నిరీక్షణ ఉండాలే కానీ ఓడిన వెంటనే పార్టీని విడిచి వెళ్లటం కాదంటూ చురకలు వేశాడు. పార్టీలో ప్రాథమిక సభ్యత్వంతో పాటు.. బిఫామ్ తీసుకున్నారని.. ఓడినంతనే తెల్లకాగితాల మీద రాజీనామాలు చేస్తున్నట్లుగా వ్యాఖ్యానించిన మహేశ్ పోతిన.. రాజకీయాల్లో ఉంటూ వ్యాపారాల ద్వారా వేల కోట్లు సంపాదిస్తున్న వారిని ప్రశ్నించటం చేతకావట్లేదన్నారు. సిద్ధాంతాల మీద నడుస్తున్న వారిని ఇవాళ కాకుంటే రేపైనా ప్రజలు అండగా ఉంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి అధినేత కు అండగా నిలిచేందుకు వీలుగా జనసేన నేత ఒకరు బయటకు వచ్చి.. తమ వాదనను వినిపించటం ఆసక్తి కరంగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News