జనాలకేనట ఓటమి... శభాష్ అనాల్సిందే

Update: 2023-02-15 20:00 GMT
ఆడలేక మద్దెల ఓడు అని వెనకటికి ఒక ముతక సామెత ఉంది. అంటే తమ సత్తా చాటుకోకుండా ఇతరుల మీదకు నిందలు వేసేవారిని ఆ జాబితాలో చేరుస్తారు అన్న మాట. ఒకపుడు ఎన్నికల్లో ఓడిన వారు ఒక గౌరవమైన మాట అనేవారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసా వహిస్తున్నామని. ఇపుడు ఆ మాట అనకపోతే పోయింది. మీరే తప్పు చేస్తున్నారు అని మీద పడి తమ అక్కసుని చూపించే నాయకులు తయారు కావడమే అసలైన రాజకీయ విషాదం.

ఈ ఒరవడికి ఆద్యుడు చంద్రబాబు అయితే వారసుడు నారా లోకేష్ అదే వరస అందుకున్నారు. మితృత్వం కోసం ఎదురుచూస్తున్న జనసేనకు సావాస దోషం అపుడే అంటినట్లుంది వారూ అదే పాట పాడుతున్నారు. ఇంతకీ 2019 ఎన్నికల్లో ఓడింది ఎవరూ అంటే కేంద్ర ఎన్నికల సంఘం కూడా కంఫ్యూజ్ అయ్యేలా ఈ పార్టీల మాటలు ఉన్నాయి.

ఓడింది మేము కాదు ప్రజలు. అవును ప్రజలే నికార్సుగా ఓడిపోయారు అని సెలవిస్తున్నారు. చంద్రబాబు ఓడిన వెంటనే అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. నేనెందుకు ఓడానో నాకు తెలియదు అంటూ కొన్నాళ్ళు నిట్టూర్చిన ఆయన ఆ తరువాత ప్రజలు తప్పు చేశారు. ప్రజలు వైసీపీని గెలిపించి బాగా అనుభవిస్తున్నారు అంటూ శాపనార్ధాలు పెడుతూ వచ్చారు.

ఈ రోజుకూ బాబు అవే మాటలను అంటున్నారు. ఇక లోకేష్ విషయానికి వస్తే ఆయన కాస్తా దీని మార్చి తన పాదయాత్ర వేళ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఓడింది ఏపీ ప్రజలే అంటున్నారు. అంటే తెలుగుదేశం గెలుపు ఓటములకు అతీతమని, అలాంటి పార్టీని ఎన్నుకోనందుకు ప్రజలే ఓడారని చినబాబు గారి నిర్వచనం అన్న మాట.

తాజాగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్న మాట ఏంటి అంటే గత ఎన్నికలో ప్రజలు ఓడిపోయారు అని. ప్రజలు ఓడిపోవడం ఏంటో ఈ కొత్త థియరీ ఏంటో ఎవరికీ అర్ధం కాని విషయమే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే అసలైన ప్రభువులు. ఇది కదా మౌలిక సూత్రం. ఆ ప్రజలకు మేము సేవ చేసుకుంటామంటూ పార్టీలు వస్తాయి.

వారి మధ్య జరిగే పోటీలో ప్రజలు ఒకరికి అవకాశం ఇస్తారు. మిగిలిన వారు ఓడతారు. అది విధానం. ఇక అలా అవకాశం ఇచ్చిన వారికి అది శాశ్వతం కానే కాదు, అయిదేళ్ళు గడిస్తే వారు కనుక సవ్యంగా చేయకపోతే కచ్చితంగా తప్పించేస్తారు. అంతటి పవర్ ఫుల్ ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో. మరి ఈ విషయం గుర్తెరిగి మసలు కోవాల్సిన పార్టీలు ప్రజలకు శాపనార్ధాలు పెట్టడం, వారే ఓడారని నిందించడం ఇదేమి కొత్త విధానమో ఎవరికీ అర్ధం కాదు.

ఈ దేశంలో ఎన్నో పార్టీలు అధికారలోకి వచ్చాయి ఎన్నో ఓడాయి. కానీ ఓడిన పార్టీలు ఎదుటి పార్టీ మీద విమర్శలు చేస్తున్నాయి తప్ప ప్రజలను నిందించిన సందర్భాలు ఎక్కడా లేవు. ఏపీలోనే ఆ నయా ట్రెండ్ స్టార్ట్ చేశారు. మరి పేరుకు ప్రజాస్వామ్యం అన్నట్లుగా అసలైన అధికారాలు తమవే అని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయా అన్నదే కీలక ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓడరు, తమ ఓటమిని ఏ పార్టీ అయినా జనం మీద రుద్దాలనుకుంటే అంతకంటే రాజకీయ ఆత్మన్యూనత కూడా మరోటి ఉండది. ఈ సంగతి పాత పార్టీల నుంచి కొత్తగా వచ్చిన పార్టీలు దాకా అంతా అర్ధం చేసుకుంటే మంచిదేమో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News