పొత్తులపై పవన్‌ తేల్చేది అప్పుడేనా!

Update: 2023-03-06 18:14 GMT
జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఇక దూకుడు పెంచనున్నారు. వాస్తవానికి గత దసరా పండుగ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆయన బస్సు యాత్ర చేస్తానని ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత ఇది సంక్రాంతి తర్వాత అని జనసేన నేతలు చెప్పారు. సంక్రాంతితోపాటు శివరాత్రి కూడా అయిపోయింది. పవన్‌ బస్సు యాత్ర లేకపోయేటప్పటికి జనసేన శ్రేణులు నిరాశలో మునిగాయి.

ఈ నేపథ్యంలో మార్చి 14 జనసేన ఆవిర్భావ సభ తర్వాత నుంచి పవన్‌ కల్యాణ్‌ తన వారాహి వాహనంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారని చెబుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పొత్తులపై కూడా జనసేన ఆవిర్భావ సభలో పవన్‌ ప్రకటన చేస్తారని అంటున్నారు. ఈసారి జనసేన ఆవిర్భావ సభ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరగనుంది. ఈ సందర్భంగా పవన్‌ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి కృష్ణా జిల్లా మచిలీపట్నం వరకు ర్యాలీగా వారాహి వాహనంలో చేరుకుంటారు.

మచిలీపట్నం ఎమ్మెల్యేగా వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఉన్నారు. పవన్‌ పై తీవ్ర విమర్శలు చేసేవారిలో ముందు వరుసలో నిలిచేవారిలో పేర్ని నాని ఒకరు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభను బందరులో నిర్వహించాలని పవన్‌ నిర్ణయించడంతో ఆ పార్టీలో జోష్‌ నెలకొంది. ఈ సభలో పేర్ని నానిని మరోసారి పవన్‌ ఏకేయడం ఖాయంగా కనిపిస్తోంది.

దీనికంటే ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందా? లేక టీడీపీతో పొత్తు ఉంటుందా? లేక రెండు పార్టీలతో పొత్తు ఉంటుందా? అసలు దేనితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తారా అనేదానిపై పవన్‌ కల్యాణ్‌ బందరు సభలో స్పష్టత ఇవ్వనున్నారని చెబుతున్నారు. అయితే ఇప్పటికే జనసేన, టీడీపీ పొత్తు ఖాయమనే భావన రాష్ట్రంలో క్షేత్ర స్థాయి వరకు వెళ్లిపోయింది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతోపాటు ఇతర టీడీపీ నేతలు సైతం జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయాలని కోరుకుంటున్నాయని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ నేతలు టీడీపీతో తమకు పొత్తు ఉండబోదని.. తమ పొత్తు కేవలం జనసేనతోనేనని తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 14న పొత్తులపై పవన్‌ క్లారిటీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కూడా పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కూడా ప్రతిపక్షాలకు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అని టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. వైసీపీ నేతలు కూడా పందులే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్‌ గా వస్తుందని సవాళ్లు రువ్వుతున్నారు. ఈ నేపథ్యంలో పొత్తులపై జనసేనాని మార్చి 14న ఏం చెప్పబోతున్నారనే దానిపై వేడివాడీగా చర్చ జరుగుతోంది.

అదేవిధంగా కాపు రిజర్వేషన్లపైనా పవన్‌ కల్యాణ్‌ స్పష్టతనిచ్చే అంశం ఉందని అంటున్నారు. రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గంగా కాపులు 25 శాతం వరకు ఉన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌ దశాబ్దాలుగా ఉంది. గతంలో అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలు.. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలు కాపులను బీసీల్లో చేరుస్తామని.. వారి ఓటు బ్యాంకును కొల్లగొట్టి అధికారంలోకి వచ్చాయి. కానీ కాపులను బీసీల్లో చేర్చలేదు. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్లపైనా మార్చి 14న పవన్‌ కల్యాణ్‌ ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News