జగన్ జనసేన కు దొరికేశారా...?

Update: 2023-06-29 09:00 GMT
ఇటీవల కాలం లో జగన్ ప్రతీ జిల్లాలో సభలు సమావేశాలూ నిర్వహిస్తూ అక్కడ పధకాల కు సంబంధించి బటన్ నొక్కి ప్రసంగాలు చేస్తూంటారు. ఈ సందర్భంగా తన ప్రభుత్వం గురించి చెప్పుకోవడమే కాకుండా విపక్షాలను కూడా గట్టిగా విమర్శిస్తూంటారు.

అయితే పార్వతీపురం మన్యం  జిల్లాలో జగన్ అమ్మవొడి నాలుగవ విడత నగదు బదిలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తమ ప్రభుత్వం గురించి చెబుతూనే యధా ప్రకారం విపక్షాల మీద కూడా మండిపడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినపుడు ఆయన వ్యక్తిగతాన్ని తవ్వారు. నాలుగు పెళ్ళిళ్ళూ అంటూ జగన్ ఫ్లోలో మాట్లాడేశారు.

అయితే ఆ సభలో ఉన్నది అమ్మ ఒడి లబ్దిదారులు అయిన విద్యార్ధులు. దాంతోనే ఈసారి సీఎం రాజకీయ విమర్శలు రక్తి కట్టకపోగా ఇబ్బంది పెట్టాయని అంటున్నారు. పవన్ పెళ్ళిళ్ల విషయం చిన్నారుల వద్ద ఎత్తడం తప్పే అని అంతా అంటున్నారు.

వారి మనసుల కు అలాంటి విషయాలు పట్టనివి. అవి వారి ముందు ఏ మాత్రం ప్రస్తావన కు తేకూడనివి. అయితే జగన్ మాత్రం పవన్ మీద విమర్శలు చేసే అతి ఉత్సాహంతోనే పెళ్ళిళ్లను కూడా తెచ్చి నాలుగూ అనేశారు అంటున్నారు. నిజానికి పవన్ మీద మిగిలిన విమర్శలు చేసినా ఓకే కానీ ఈ విమర్శల తోనే జనసేన కు ఆయుధం దొరికినట్లు అయింది అంటున్నారు.

నిజానికి జనసేన కార్నర్ అవుతుంది అనుకుంటే వైసీపీకి అవి బూమరాంగ్ అయ్యాయి అంటున్నారు. దీని మీద నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఎక్కడేమి మాట్లాడారో ఈ సీఎం కి తెలియదు అంటున్నారు. ముఖ్యమంత్రి హోదా లో ఉండి స్థాయి మరచి ఆయన పవన్ మీద వ్యక్తిగతంగా దాడి చేశారు అని అన్నారు

జనసేన ను విమర్శించాలంటే పాలసీల మీద ముఖ్యమంత్రి మాట్లాడాలి కానీ వ్యక్తిగతం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ప్రజాధనంతో నిర్వహించే సభల లో రాజకీయ విమర్శలా అని నాదెండ్ల మండిపడ్డారు. పిల్లల కు ప్రభుత్వం ఏమి చేస్తుందో సందేశం ఇవ్వాల్సిన సీఎం కాస్తా అది మరచి రాజకీయాలు మాట్లాడం దారుణం అన్నారు. జగన్ సభ కు కోట్లు వెచ్చించారని తీరా అక్కడ పవన్ మీద విమర్శలు చేయడానికి ఉపయోగించుకుంటారా అని నిందించారు. ప్రభుత్వం ఖర్చులో గాలి లో విమానాలతో హెలికాప్టర్లలో జగన్ తిరుగుతున్నారని ఆయన విమర్శించారు.

దీంతో ఇపుడు పవన్ నాలుగు పెళ్ళిళ్ల మీద విమర్శలు ఎలా ఉన్నా విద్యార్థుల మధ్య అలాంటి విమర్శలు సీఎం హోదా లోని వ్యక్తికి తగునా అన్నది ఏపీ లో చర్చకు జనసేన పెట్టేసింది. మరి దీని మీద వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. చిత్రమేంటి అంటే గతంలో చంద్రబాబు కూడా ప్రభుత్వ ఖర్చుతో జరిగే సభల్లో రాజకీయాలు మాట్లాడేవారు. దేశంలో ఉన్న పెద్దలు కూడా ఇపుడు అదే పని చేస్తున్నారు. కానీ జగన్ మీదనే జనసేన టార్గెట్ చేసింది అని వైసీపీ నేతలు అంటున్నారు.

Similar News