కాపుల ఓట్లతోనే కధ సాగేనా....పవన్ వ్యూహం ఏంటి...?

Update: 2022-12-21 00:30 GMT
ఏపీలో కాపుల చుట్టూ రాజకీయం సాగుతోంది. నిజానికి ఏపీ ఎన్నికలు అంటే సంకుల సమరమే. ప్రతీ సారి కులం వైపు నుంచే రాజకీయాన్ని తిప్పుతూ ఉంటారు. అయితే గడచిన ఎన్నికల్లో ఒక కులం అని కాదు అన్ని కులాల సమాహారం అయిన బీసీ కులం చుట్టూనే రాజకీయాలు సాగుతూ వచ్చేవి. 2014 ఎన్నికల్లో బీసీలు తెలుగుదేశం పార్టీకి దన్నుగా నిలబడ్డారు. పవన్ సపోర్టుతో కాపులు కూడా ఆ పార్టీకి మద్దతు ఇచ్చారు. బంపర్ మెజారిటీతో టీడీపీ గెలిచింది.

ఇక 2019 నాటికి చూస్తే జగన్ కి కూడా అదే జరిగింది. అటు కాపులు ఇటు బీసీలు కూడా వైసీపీకి పట్టం కట్టాయి. అందుకే చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని వైసీపీ 151 సీట్లు సాధించింది అందుకుంది. 2024 ఎన్నికల్లో కూడా కులాలే ఇంపార్టెంట్. అయితే ఈసారి కాపుల చుట్టూ రాజకీయం మొత్తం చక్కర్లు కొడుతోంది. దానికి కారణం మూడవ పార్టీగా దూసుకువస్తున్న జనసేన.

ఆ పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ తనకు కులం లేదని చెప్పుకుంటున్నారు. అన్ని కులాలు సమానమే అని అంటున్నారు. కానీ ఏపీలో బలమైన కులంగా ఉన్న కాపులు మాత్రం జనసేనను సొంతం చేసుకున్నారు. ఆ పార్టీ వైపు మెజారిటీ సామాజికవర్గం మొగ్గు చూపుతోంది. ఇపుడు కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా కాపులలో ఉంది.

ఇక ఏపీలో చూస్తే ప్రధాన పార్టీలకు వారి వారి సొంత కులాల మద్దతు ఉంటూ వస్తోంది. టీడీపీకి కమ్మల మద్దతు ఉంటే వైసీపీకి రెడ్ల మద్దతు ఉంది అని చెప్పుకుంటారు. అయినా సరే వారు మిగిలిన అన్నికులాలను కూడా కూడగట్టుకుని ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇక జనసేన విషయం తీసుకుంటే అన్ని కులాలతోనే అధికారం సాధ్యం అన్నది ఆ పార్టీ నేతలకు తెలుసు. కానీ ప్రధాన అండగా కాపులను ముందు ఉంచుకుంటే రాజకీయం సవ్యంగా సాగుతుంది అన్నదే ఆలోచన.

ఇక ఏపీలో కాపులంతా జనసేనకు ఓట్లేస్తారా, కాపులలో ఉన్న బలమైన ఆకాంక్ష జనసేనను విజయతీరాలకు చేరుస్తుందా అంటే దాని మీద రకరకాలైన విశ్లేషణలు ఉన్నాయి. కాపులు నిజానికి గట్టిగా రాజ్యాధికారాన్ని కోరుకున్నది 2009 ఎన్నికల వేళ. ఆనాడు సినీ హీరోగా నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టారు. ఆయన ఎన్టీయార్ తో సమానమైన ఇమేజ్ ని కలిగి ఉన్న వారుగా గుర్తింపు ఉంది.

ఉమ్మడి ఏపీలో ఆయన ప్రజారాజ్యం పార్టీని ఒక ప్రభంజనంగా తీసుకునివచ్చారు. సంచలన విజయమే నమోదు అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే పద్దెనిమిది సీట్లను సాధించింది. అలాగే 74 లక్షల 63 వేల 509 ఓట్లని సాధించింది. ఓట్ల షేర్ చూస్తే 18 శాతంగా రికార్డు అయింది. ఆనాడు గోదావరి జిల్లాలోని కాపులంతా పోటెత్తి మరీ జై పీయార్పీ అని అన్నారు. అంతటి పీక్ టైం లో వచ్చిన ఓట్ల శాతం అది.

నిజంగా అది చాలా గొప్ప విషయం పార్టీ పెట్టి ఎనిమిది నెలలు మాత్రమే అయిన నేపధ్యమంది. పైగా ఒక వైపు అధికార కాంగ్రెస్, మరో వైపు విపక్ష టీడీపీ ఉన్నాయి. అటు వైఎస్సార్ ని ఇటు చంద్రబాబు వ్యూహాలను తట్టుకుని మరీ అంత ఓట్ల శాతాన్ని సాధించడం అంటే ప్రజారాజ్యం నిజంగా బాగానే పెర్ఫార్మ్ చేసినట్లుగా చూడాలి. ఇక ఇపుడు 2024 ఎన్నికలకు వస్తే నాటి ఊపు ఇపుడు జనసేనకు ఉంటుందా అన్నది చర్చగా ఉంది. ఆనాడు అంతా కలసి జై కొట్టినా అధికారానికి ప్రజారాజ్యం చేరువ కాలేకపోయింది. చాలా మందికి చేదు అనుభవాలు ఉన్నాయి.

ఆ తరువాత మరో రెండు ఎన్నికలను చూసిన కాపులు ఈసారి మరో ఛాన్స్ తనది అనుకునే పార్టీకి ఇవ్వాలి అనుకుంటే ప్రజారాజ్యం కాలం నాటి ప్రభంజనం కనుక వీస్తే జనసేనకు కూడా 18 శాతం ఓట్ల షేర్ దక్కుతుంది అని అనుకున్నా సొంతంగా అధికారంలోకి రావడానికి ఇది సరిపోతుందా అన్నదే అతి ముఖ్యమైన ప్రశ్న. ఏపీలో తెలుగుదేశానికి దాదాపుగా నలభై శాతం ఓటు షేర్ ఉంది. వైసీపీకి యాభై శాతం ఓట్ల షేర్ ఉంది. ఇపుడు జనసేన ఒంటరిగా పోటీ చేస్తే 2019లో వచ్చిన ఆరు శాతాన్ని మూడింతలు పెంచుకున్నా కూడా  అధికారం సాధ్యపడుతుందా అన్నది చూడాలి.

అదే టైంలో ఈ పద్దెనిమిది శాతం ఓట్లు ఏ పార్టీ ఖాతా నుంచి లాగేసుకుంటారు అన్నది కూడా ఆలోచించాలి. 2019లో మెజారిటీ కాపులు వైసీపీకి ఓటేశారు కాబట్టి ఈసారి ఆ ఓట్లు వెనక్కి వస్తే కచ్చితంగా ఆ పార్టీకి నష్టమే అంటున్నారు. అది ఎంత అన్నది కూడా చూడాలి. మరో వైపు చూస్తే తెలుగుదేశం పార్టీకి కూడా కాపుల ఓట్లు 2019 ఎన్నికల్లో బాగా పడ్డాయి. దాంతో ఆ పార్టీ ఓటు బ్యాంక్ కి కూదా గండి పడుతుంది. ఇంత జరిగినా జనసేనకు మ్యాజిక్ చేస్తుందా అంటే డౌట్ ఉంటుందని అంటున్నారు.

అదే కాపుల ఓట్లతో పాటు మిగిలిన సామాజిక వర్గాల ఓట్లు కూడా జనసేనకు టర్న్ కావాల్సి ఉంది. అలా చూసుకుంటే బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓటు బ్యాంక్ కూడా కొల్లగొట్టాలి. జనసేన ఇపుడు అదే పనిలో ఉంది అని అంటున్నారు. పవన్ పదే పదే ఒక మాట చెబుతున్నారు. కాపులు అంతా ఏకం కావాలని, అదే విధంగా మిగిలిన సామాజిక వర్గాలకు పెద్దన్నగా వ్యవహరిస్తూ అందరినీ కలుపుకుని ముందుకు సాగాలని. ఇక తాజాగా సత్తెనపల్లిలో జరిగిన సభలో పవన్ ఇచ్చిన సందేశం కూడా అదే. రాజ్యాధికారం దక్కని కులాలను జనసేన ముందుండి నడిపిస్తుంది అని వారికి అధికారం అందిస్తుంది అని.

ఆ దిశగా ఇపుడు జనసేన తన వ్యూహాలకు పదును పెడుతోంది. మరి అది కనుక సక్సెస్ అయితే ఏపీలో జనసేన సంచలనం క్రియేట్ చేయవచ్చు. ఇక అధికారం దక్కాలీ అంటే ముప్పయి అయిదు శాతం ఓట్ల షేరే రావాల్సిన అవసరం లేదు పాతిక శాతం ఓట్ల షేర్ తో కూడా అధికారాన్ని అందుకున్న పార్టీలు దేశంలో ఉన్నాయి. కాబట్టి జనసేన తన వద్ద ఉన్న ఓటు బ్యాంక్ తాను స్థిరం అనుకున్న ఓటు బ్యాంక్ కి మిగిలిన వర్గాలను కూడా కలుపుకుంటే సూపర్ హిట్ కొట్టినట్లే అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News