ఇక.. ‘జన్ పథ్’లో చంద్రబాబు

Update: 2016-07-09 07:23 GMT
ఇందులో ట్విస్ట్ ఏమీ లేదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్ పథ్ లో కనిపించనున్నారు. దేశ రాజధానికి వెళ్లిన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన జన్ పథ్ లో బస చేసే అవకాశాన్ని కేంద్రం కల్పించనుంది. ఇప్పటివరకూ చంద్రబాబు అధికారిక విడిదిగా ఏపీ భవన్ లో ఏర్పాటు చేసేవారు. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న జన్ పథ్ లోని ఒకటో భవంతిని బాబు బస కోసం కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ఈ ఇంట్లోనే బాబుతో పాటు.. బాబు కుటుంబ సభ్యులు కూడా బస చేసే సౌకర్యం ఉండనుంది.

జన్ పథ్ అన్న వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో పాటు.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా నివాసం కూడా అక్కడే. తాజాగా బాబు బస కోసం ఈ ప్రాంతంలోని భవంతిని ఏర్పాటు చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. ఇంతకాలం ఏపీ భవన్ లో బస ఏర్పాటు చేసేవారు.

ఈ మధ్యనే ఏపీ భవన్ ను తమకే పూర్తిగా కేటాయించాలని.. అది తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన నిజాంకు చెందినదని.. హైదరాబాద్ స్టేట్ లో భాగంగా ఏపీ భవన్ మొత్తంగా తమకే చెల్లుతుందంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చిత్రమైన వాదనను వినిపించటం తెలిసిందే. ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. కేంద్రం బాబు బసను జన్ పథ్ కు మారుస్తూ నిర్ణయం తీసుకోవటం గమనార్హం.
Tags:    

Similar News