స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తమ తొలి ప్రైవేట్ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించాలనుకున్న జపాన్ కల చెదిరింది. ఎన్నో కష్టనష్టాలకోర్చి రూపొందించిన `మోమో-2`రాకెట్ ప్రయోగించిన కొద్దిసేపటికే నేల కూలి మంటల్లో బూడిదయిపోయింది. దాదాపు 2.7 మిలియన్ డాలర్లను ఖర్చుతో ఇంటర్ స్టెల్లార్ టెక్నాలజీస్ తయారు చేసిన ఆ రాకెట్ క్షణాల్లో కుప్పకూలడంతో జపాన్ పరిశోధకులు షాకయ్యారు. ఎన్నో అంచనాలతో నింగికెగరిన `మోమో-2`....కేవలం 60 అడుగుల ఎత్తుకు ఎగిరి లాంచింగ్ ప్యాడ్ పైనే కుప్పకూలింది. దీంతో, ఒక్కసారిగా లాంచింగ్ ప్యాడ్ వద్ద మంటలు చెలరేగాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని ఇంటర్‌స్టెల్లార్ వ్యవస్థాపకుడు టకఫుమి హొరీ తెలిపారు.
Full View
దక్షిణ హొకైడో ద్వీపంలోని టైకి అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శనివారం ఉదయం 5.30 నిమిషాలకు ఈ ప్రయోగాన్ని ఇంటర్ స్టెల్లార్ చేపట్టింది. దాదాపు 10 మీటర్ల పొడవు....టన్ను బరువున్న మోమో-2 రాకెట్ ను పరిశోధకులు ప్రయోగించారు. అయితే, ప్రయోగించిన క్షణాల్లోపే `మోమో-2` నేలకొరిగింది. గాలిలోకి 60 అడుగుల ఎత్తు ఎగిరిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. రాకెట్ మెయిన్ ఇంజన్ ఫెయిలై మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. అయితే, లోపాలను సరిదిద్దుకొని మరోసారి రాకెట్ ను ప్రయోగించడానికి ప్రయత్నాలు చేస్తామని హొరీ తెలిపారు. వాస్తవానినికి మోమో-2 ను ఈ ఏడాది ఏప్రిల్ చివర్లో ప్రయోగించాలని భావించారు. కానీ, ఇంజన్ లో నైట్రోజన్ గ్యాస్ లీకవడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని వాయిదా వేశారు. కాగా, గత ఏడాది జూలైలో చేపట్టిన మోమో-1 రాకెట్ ప్రయోగం కూడా ఇదే తరహాలో విఫలమైంది.