అమ్మ కార్లు రోడ్ల మీద‌కు రావా?

Update: 2017-05-18 06:25 GMT
ఒక మ‌నిషి లేకుంటే ప‌రిస్థితులు ఎంత‌గా మారిపోతాయో దివంగ‌త త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థ‌మైపోతుంది. ఆమె బ‌తికున్న రోజుల్లో వీధుల్లో రాజ‌సాన్ని ఒల‌క‌బోసిన ఆమె ప్ర‌యాణించిన కార్లు ఇప్పుడు.. షెడ్డుకే ప‌రిమిత‌మ‌య్యాయి. ఆమె ప్ర‌యాణించిన వాహ‌నాలు రోడ్ల మీద‌కు వ‌స్తున్నాయంటే వీవీఐపీ ట్రీట్ మెంట్ ఉండేది. ఆమె  ప‌లు ఖ‌రీదైన కార్ల‌లో ప్ర‌యాణించే వారు. ఆమె మ‌ర‌ణం త‌ర్వాత నుంచి వీలునామా లేక‌పోవ‌డంతో వాటిని ఉప‌యోగించే అవ‌కాశం కూడా లేదు.

అమ్మ బ‌తికి ఉన్న‌ప్పుడు ఒక వెలుగు వెలిగిపోయిన పోయెస్ గార్డెన్ లోని వేద నిల‌యం ఇప్పుడు క‌ళావిహీనంగా మారిపోయింది. భ‌వ‌నం మాత్ర‌మే కాదు.. అమ్మ‌కు చెందిన ఆస్తుల‌న్నీ ఇప్పుడు ఎవ‌రి అల‌నాపాల‌నా లేనివిగా మారాయి. అమ్మ మ‌ర‌ణించిన నాటి నుంచి నేటి వ‌ర‌కూ అమ్మ‌కు చెందిన ప‌లు విలువైన కార్లు షెడ్డుకే ప‌రిమిత‌మ‌య్యాయి.

త‌న ఆస్తులకు సంబంధించి..అమ్మ ఎలాంటి వీలునామా రాయ‌క‌పోవ‌టంతో.. ఆమె ఆస్తులు ఇప్పుడు ఎవ‌రి అల‌నాపాల‌నా లేకుండా ఉండిపోతున్నాయి. వివిధ ఆస్తుల‌తో పాటు అమ్మ ద‌గ్గ‌ర ఖ‌రీదైన ప‌లు వాహ‌నాలు ఉండేవి. వీటిల్లో రెండు ట‌యోటా ప్రాడో ఎస్ యూవీలు.. టెంపో ట్రావెల‌ర్‌.. టెంపో ట్రాక్స్‌.. మ‌హీంద్ర జీపు.. మ‌హేంద్ర బొలెరో.. స్వ‌రాజ్ మ‌జ్దా మ్యాక్సీ.. 1990 నాటి కాంటెస్సా.. 1980 నాటి అంబాసిడ‌ర్ కార్లు అమ్మకు చెందిన వేద నిల‌యంలో ఉన్నాయి.

రూల్స్ ప్ర‌కారం చూస్తే.. వాహ‌న య‌జ‌మానులు ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే.. వారి వార‌సులు ఎవ‌రైనా.. త‌మ హ‌క్కు ప‌త్రాలు చూపించి ఆర్టీవో ద‌గ్గ‌ర రిజిస్ట్రేష‌న్ చేయించుకోవాలి. ఇందుకు మూడు నెల‌ల గడువు ఉంటుంది. డిసెంబ‌రు 5న అమ్మ మ‌ర‌ణించారు. రూల్ ప్ర‌కారం చూస్తే.. అమ్మ వాహ‌నాల్ని బ‌దిలీ చేసుకునే హ‌క్కు కాలం తీరిపోయిన‌ట్లే. మ‌రి.. ఖ‌రీదైన వాహ‌నాలు ఇక అలా ఉండిపోవ‌ట‌మేనా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News