ఆస్ప‌త్రిలోకి చేర్చేట‌పుడు అమ్మ అలా ఉంద‌ట‌

Update: 2017-12-16 09:26 GMT
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మ‌ర‌ణించి ఏడాది దాటిపోయిన‌ప్ప‌టికీ...ఇంకా సంచ‌ల‌నాలు వెలువ‌డ‌టం ఆగ‌డం లేదు. అమ్మ మ‌ర‌ణంలో అనేక ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు తాజాగా తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. జ‌య‌ల‌లిత చికిత్స అందించిన  అపోలో హాస్పిట‌ల్స్‌ వైస్‌ చైర్మన్ ప్రీతారెడ్డి ఒక తమిళ చానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప‌లు సంచ‌ల‌న అంశాల‌ను వెల్ల‌డించారు. గతేడాది సెప్టెంబర్ 22న జ‌య‌ల‌లిత‌ను ఆస్ప‌త్రికి తీసుకొచ్చిన స‌మ‌యంలో ఆమె  ఊపిరాడని స్థితిలో ఉన్నార‌ని తెలిపారు.

గతేడాది సెప్టెంబర్‌ లో ఆరోగ్యం క్షీణించటంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో జయలలితను చేర్పించ‌గా....దాదాపు మూడు నెలల పాటు చికిత్స అందించినప్పటికీ ఆమె కోలుకోలేదు. డిసెంబర్‌ 5 న గుండెపోటు అధికం కావటంతో ఆమె మృతి చెందారు. ఐతే మూడు నెలల పాటు చికిత్స అందించినప్పటికీ అందుకు సంబంధించిన ఒక్క ఫోటో కానీ వీడియో కానీ మీడియాకు విడుదల చేయలేదు. దీంతో జయలలిత మరణంపై ప్రతి ఒక్కరిలో అనుమానాలు మొదలయ్యాయి. అప్పటి సీఎం పన్నీర్‌ సెల్వం ను సైతం జయను చూసేందుకు అనుమతించ లేదు. అమ్మ మరణించే వరకు కూడా ఆమెకు అందిన వైద్యంపై ఎలాంటి సమాచారం లేకపోవటంతో స్వయంగా పన్నీర్ సెల్వమే న్యాయ విచారణకు  డిమాండ్‌ చేశారు. దీంతో పళనిస్వామి ప్రభుత్వం ఎట్టకేలకు ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నేప‌థ్యంలో ప్రీతారెడ్డి ఓ మీడియా సంస్థ‌తో ఈ వివ‌రాలు పంచుకున్నారు. `మేము అత్యుత్తమ వైద్యసేవలు అందించాం. ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులతో పాటు విదేశాల నుంచి నిపుణులను రప్పించాం. ఆమె ఆరోగ్యస్థితి మెరుగుపడినా - చివరికి అందరూ కోరుకున్నదానికి భిన్నంగా జరిగింది` అని ప్రీతారెడ్డి చెప్పారు. జయ మృతిపై ఏకసభ్య కమిషన్ విచారణ ద్వారా అన్ని రహస్యాలకు సమాధానం దొరుకుతుందని ఆమె అన్నారు. డేటాను వారు పరిశీలిస్తే, అన్ని మిస్టరీలు కూడా విడిపోతాయని తాను భావిస్తున్నానని ప్రీతా రెడ్డి అన్నారు. కాగా, అమ్మ ఆస్ప‌త్రిలో ఉన్న స‌మ‌యంలో అత్యంత వివాదాస్ప‌ద‌మైన ఉప ఎన్నిక‌ల నామినేష‌న్ ప‌త్రంపై సంత‌కం అంశంలో ప్రీతారెడ్డి వివ‌ర‌న ఇచ్చారు. తన వేలిముద్రలు తీసుకుంటున్నట్లు జయలలితకు తెలుసా అనే విష‌యంలో తాను స‌మాధానం ఇవ్వ‌లేన‌న్నారు. తాను ఆ స‌మ‌యంలో అక్క‌డ లేన‌ని ప్రీతారెడ్డి వివ‌రించారు.

కాగా అమ్మ చికిత్స స‌మ‌యంలో ప్ర‌భుత్వ ప్ర‌తినిధిగా ఉన్న డాక్ట‌ర్ బాలాజీ అర్ముగ‌స్వామి కమిష‌న్‌ కు ముందు గ‌త‌ గురువారం హాజ‌రైన సందర్భంగా సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. అమ్మ‌కు ఎలాంటి చికిత్స అందించారో త‌మ‌కు తెలియ‌దని ఆయ‌న పేర్కొన్నారు. అపోలో ఆస్ప‌త్రిలో త‌మ‌కు క‌నీసం టీవీ కూడా లేని ఓ రూమ్‌ ను కేటాయించార‌ని ఎలాంటి చికిత్స అందుతుందో క‌నీసం వెల్ల‌డించేవారే కాద‌న్నారు. అడ‌పాద‌డ‌పా...బులెటిన్‌ ను త‌మ‌కు చ‌దివి వినిపించేవార‌న్నారు. అమ్మ‌ను ఓ సారి సిటీస్కాన్‌ కు తీసుకువెళుతున్న‌ప్పుడు చుట్టూ కర్టెన్ క‌ట్టార‌ని ఆయ‌న వివ‌రించారు. ప్ర‌తిరోజూ ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు తాము అలా కూర్చుండిపోయేవాళ్లం త‌ప్పించి ప్ర‌త్యేకంగా ఏ ప‌ని ఉండ‌క‌పోయేద‌ని ఆయ‌న వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News