జేసీకి బీర‌కాయ‌పీచు సంబంధం గుర్తుకొచ్చిందే!

Update: 2019-06-03 10:24 GMT
రాజ‌కీయాలు మ‌హా సిత్రంగా ఉంటాయి. అందునా తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయం  మ‌రింత సిత్రంగా ఉంటుంది. క‌డుపులో క‌త్తులు దాచుకోవ‌టం తెలుగు రాజ‌కీయాల్లో మామూలే. అప్ప‌టివ‌ర‌కూ బండ బూతులు తిట్టేసి.. టైం తేడా కొడితే.. తిట్టిన నోటితోనే పొగిడేసే వైనం ప‌లువురు నేత‌ల్లో క‌నిపిస్తూ ఉంటుంది. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు ఓపెన్ గా మాట్లాడ‌తా.. మ‌న‌సుకు తోచించి మాట్లాడ‌తా? అంటూ ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడిన జేసీ దివాక‌ర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఉద్దేశించి ఆయ‌న విప‌రీతంగా పొగిడేశారు. గ‌తంలో జ‌గ‌న్ కు కుల‌పిచ్చిని అంట‌క‌ట్టిన ఆయ‌న‌.. అందుకు భిన్నంగా జ‌గ‌న్  మావోడు అంటూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.  ఎన్నిక‌ల వేళ‌లో జ‌గ‌న్ కుల రాజ‌కీయాలు చేస్తున్నార‌ని.. ఆయ‌న‌కు కుల పిచ్చి అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

అలాంటి జేసీ తాజాగా మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడ‌టం ఒక విశేషం. ఆయ‌న రాజ‌కీయ వార‌సులు తాజా ఎన్నిక‌ల్లో ఘోరంగా ప‌రాజ‌యం పాలు కావ‌టం మీద జేసీ మాట్లాడ‌లేదు. కాకుంటే.. తానిక రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని చెప్పిన జేసీ.. జ‌గ‌న్ ఏపీ ప్ర‌త్యేక హోదా సాధిస్తాడ‌ని స్ప‌ష్టం చేశారు. ఇదే జేసీ.. గ‌తంలో ఏం చేసినా ఏపీకి ప్ర‌త్యేక హోదా రాదంటే.. రాద‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం.

జ‌గ‌న్ మావోడే.. ప‌వ‌ర్లోకి వ‌చ్చాడ‌న్న జేసీ.. ముఖ్య‌మంత్రి అయ్యాడు.. కంగ్రాట్యులేష‌న్స్ టు హిమ్ అని వ్యాఖ్యానించారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో జ‌గ‌న్ మొద‌ట్నించి నిజాయితీగా ఉన్నాడ‌న్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో జ‌గ‌న్ మాట్లాడిన మాట‌లు అద్భుత‌మ‌న్న జేసీ.. మోడీ మేజిక్ ఫిగ‌ర్ కంటే ఎక్కువ సీట్లు సాధించ‌టం మన ఖ‌ర్మ అంటూ జ‌గ‌న్ అన‌టాన్ని అభినందించారు.

కేంద్రంలో బీజేపీ అత్య‌ధిక మెజార్టీతో ప‌వ‌ర్ లోకి రావ‌టంతో తాను న‌మ‌స్కారం పెట్ట‌టం త‌ప్ప చేసేదేమీ లేద‌ని జ‌గ‌న్ చెప్ప‌టం మంచి ప‌రిణామంగా చెప్పిన జేసీ.. జ‌గ‌న్ మాట‌ల్లో వాస్త‌వం ఉంద‌న్నారు. హోదా కోసం సిగ‌ప‌ట్లు.. మెడ‌ప‌ట్ల‌కు వెళ్ల‌టం స‌రికాద‌ని తాను అప్ప‌ట్లోనే చెప్పానన్నారు.
Tags:    

Similar News