ప్ర‌బోధానందతో లింకు ఎక్క‌డ చెడింది జేసీ?

Update: 2018-09-19 07:26 GMT
వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తే జేసీ మాత్ర‌మే చేయ‌గ‌ల‌ర‌న్న పేరు ప్ర‌ఖ్యాతుల్ని సొంతం చేసుకున్నారు అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి. ఎవ‌రి మీద‌నైనా స‌రే కోపం వ‌చ్చిందంటే చాలు.. వెనుకా ముందు చూసుకోకుండా చెల‌రేగిపోవ‌టం.. ఆ ఇష్యూలో ఎంత‌వ‌ర‌కైనా స‌రే సై అన‌టం ఆయ‌న త‌త్త్వంగా చెబుతారు.

త‌న‌కు న‌చ్చ‌ని విష‌యాలు ముఖ్య‌మంత్రిలో ఉన్నా.. వాటిని ఓపెన్ గా మాట్లాడ‌టం జేసీకి మాత్ర‌మే సాధ్యం. ఆ మ‌ధ్య‌న చంద్ర‌బాబు నిత్యం టెలీ కాన్ఫ‌రెన్స్ లు అంటూ గంట‌ల కొద్దీ టైం వృధా చేస్తున్నార‌ని.. దీని కార‌ణంగా అధికారులు ప‌ని చేయ‌టం మానేశారంటూ విమ‌ర్శ‌లు చేయ‌టంతో బాబు సైతం డిఫెన్స్ లో ప‌డిపోయే ప‌రిస్థితి.

ఇలాంటి ఎన్నో సంచ‌ల‌నాలు జేసీ సొంతం. అలాంటి ఆయ‌న తాజాగా తాడిప‌త్రిలోని ప్ర‌బోధానంద స్వామిపై విరుచుకుప‌డ‌టం.. ఆయ‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌టం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. తాజాగా చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌లో ఒక‌రు మ‌ర‌ణించి.. ప‌లువురు గాయ‌ప‌డిన వైనం చూస్తే.. జేసీకి.. ప్ర‌బోధానంద‌కు మ‌ధ్య గొడ‌వ తీవ్ర‌త ఎంత ఎక్కువ‌గా ఉంద‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. అయితే.. జేసీకి.. ప్ర‌బోధానంద స్వామికి మ‌ధ్య త‌గులాట ఈ మ‌ధ్య‌నే త‌ప్పించి.. గ‌తంలో లేద‌న్న మాట‌ను చెబుతున్నారు.

అంతేకాదు.. గ‌తంలో స్వామిలోరితో స‌ఖ్యంగా ఉండ‌ట‌మే కాదు.. ఆయ‌న నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల‌కు జేసీ వెళ్ల‌టం.. స్వామిని పొగ‌డ‌టం లాంటివి చేశార‌ని చెబుతున్నారు. ఇందుకు సాక్ష్యంగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వ‌చ్చాయి. మ‌రి.. గ‌తంలో స్వామితో అంత స‌న్నిహితంగా ఉంటూ.. తాజాగా మాత్రం ఎందుకిలా? అంటే.. ఆస‌క్తిక‌ర‌మైన అంశాల్ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం స్వామిపై నిప్పులు చెరుగుతున్న జేసీ.. గ‌తంలో అదే స్వామికి చెందిన ఆశ్ర‌మానికి తానే ప్రారంభించాన‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోతున్నారు. ప్ర‌బోధానంద కుమారులు రాజ‌కీయంగా ఎదుగుతుండ‌టం.. రానున్న రోజుల్లో రాజ‌కీయ కార్య‌క్ర‌మాల్లోకి రావాల‌న్న ఆలోచ‌న‌లో రావ‌ట‌మే జేసీకి కంట‌గింపుగా మారింద‌న్న మాట చెబుతున్న వారు లేక‌పోలేదు. అదే జ‌రిగితే త‌న కొడుకు రాజ‌కీయ కెరీర్ ప్ర‌మాదంలో ప‌డుతుంద‌న్న ముంద‌స్తు ఆలోచ‌న‌తోనే శ్రీ‌కృష్ణ మందిరంపై జేసీ త‌న వ‌ర్గీయుల‌తో దాడులు చేయిస్తున్నార‌ని చెబుతున్నారు.

ప్ర‌బోధానంద ఎవ‌రో త‌న‌కు తెలీద‌ని ఒక రేంజ్లో తిట్టేస్తున్న జేసీకి.. గ‌తంలో తాను ఆయ‌న ఆశ్ర‌మంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న ఫోటోలు ఉన్నాయ‌ని.. అవి ప్ర‌జ‌ల్లోకి వెళితే.. త‌న ఇమేజ్ డ్యామేజ్ అవుతుంద‌న్న విష‌యాన్ని గుర్తిస్తే మంచిదంటున్నారు. దీనికి తోడు త‌మ‌పై దాడుల‌కు పాల్ప‌డుతున్న జేసీకి చెక్ పెట్టేందుకు ప్ర‌బోధానంద వ‌ర్గం వారు ఇప్ప‌టికే గ‌తానికి సంబంధించిన ఫోటోల‌తో సోష‌ల్ మీడియాలో  ప్ర‌చారం షురూ చేయ‌టం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News