జ‌గ‌న్ పార్టీ నేత పెద్ద‌న్న అనేసిన జేసీ

Update: 2017-05-09 09:55 GMT
త‌న‌దైన శైలిలో ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసే అనంత‌పురం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి మరోమారు అదే శైలిలో కామెంట్లు చేశారు. అయితే ఇటీవ‌లి కాలంలో నోటి దురుసును ప్ర‌ద‌ర్శిస్తున్న జేసీ తాజాగా పొగ‌డ్త‌ల వ‌ర్షంలో ముంచెత్తారు. అది కూడా వైసీపీ అంటే విరుచుకుప‌డే త‌త్వ‌మున్న జేసీ అదే పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత, ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌ రెడ్డిని ఆత్మీయుడిగా పెద్ద‌న్న‌గా అభివ‌ర్ణించారు.

దక్షిణ మధ్య రైల్వే ప‌రిధిలోని ఏపీకి చెందిన ఎంపీల‌తో రైల్వే జీఎం విజ‌య‌వాడ స‌త్య‌నారాయ‌ణ‌పురంలోని రైల్వే ట్రయినింగ్ కాలేజీలో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి కొత్త రైళ్లు - కొత్త లైన్లపై చర్చించారు. అలాగే రైళ్లకు అదనపు బోగీలు - రైల్వేస్టేషన్లలో సౌకర్యాల మెరుగు తదితర అంశాలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. అలాగే దూర ప్రాంత రైళ్లకు రాష్ట్రంలో స్టాపుల సంఖ్య పెంచాలని కూడా ఈ సందర్భంగా ఎంపీలు దక్షిణ మధ్య రైల్వే జీఎంను కోరారు. ఈ భేటీలో ఎంపీలు జేసీ దివాకరరెడ్డి - మురళీమోహన్ - గోకరాజు గంగరాజు - మిధున్ రెడ్డి - మేకపాటి- అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంత‌రం జేసీ దివాక‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప‌క్కనే ఉన్న వైసీపీ ఎంపీ మేకపాటిని ఉద్దేశించి పెద్దన్న అని సంబోధిస్తూ ఆయన భుజంపై చెయ్యి వేశారు. ఈ సంద‌ర్భంగా జేసీ సరదా వ్యాఖ్యలు చేశారు. `జ‌గ‌న్ పార్టీకి చెందిన నాయ‌కుడు...పెద్ద‌న్న లాంటోడు`` అంటూ ప్ర‌శంస‌లు గుప్పించారు.

ఈ సంద‌ర్భంగా వైసీపీ ఎంపీ మేకపాటి మాట్లాడుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యంలో రైల్వే శాఖ తీరును తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఏపీకి చెందిన ఎన్నో ప‌నులు పెండింగ్‌లో ఉన్న‌ప్ప‌టికీ అధికారుల నుంచి చూస్తాం, చేస్తాం, కుదరకపోవచ్చు.. వంటి నిర్లక్ష్యపు సమాధానాలే వచ్చినట్లు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే లేవనెత్తిన అన్ని అంశాలపై తక్షణం స్పందించాల్సిందిగా కోరినట్లు పేర్కొన్నారు. నడికుడి-శ్రీకాళహస్తి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు చెబుతున్న సమాధానాలు దాటవేసే ధోరణితోనే ఉన్నాయని మేకపాటి అసంతృప్తి వ్యక్తం చేశారు.


Tags:    

Similar News