చంద్ర‌బాబంటే మోదీకి అసూయ‌...జేసీ

Update: 2018-03-07 09:39 GMT
స్వ‌ప‌క్షం, విప‌క్షం అన్న తేడా లేకుండా నిర్మొహ‌మాటంగా మాట్లాడ‌డం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి నైజం. ఇప్ప‌టికే చాలాసార్లు త‌మ పార్టీనేత‌లకు సంబంధించిన విష‌యాల‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు జేసీ చెప్పేశారు. తాజాగా, ఈ టీడీపీ ఫైర్ బ్రాండ్....ఏకంగా ప్ర‌ధాని మోదీపైనే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబుపై మోదీకి చాలా కోపం ఉంద‌ని, ఎందుకో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని అన్నారు. అయితే, చంద్ర‌బాబు నాయుడు అపార అనుభ‌వం - నేర్పు - చ‌తుర‌త ఉన్న స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడ‌ని - భవిష్య‌త్తులో ప్ర‌ధాని ప‌ద‌వికి ఆయ‌న పోటీ అవుతాడ‌నే ఉద్దేశంతోనే మోదీ..చంద్ర‌బాబుపై కోపం పెంచుకున్నార‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈశాన్య రాష్ట్రాల‌లో బీజేపీ గెలుపుతో మోదీకి బ‌లం పెరిగింద‌ని, ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఏపీ తో పెద్ద‌గా ప‌ని లేద‌ని అందుకే రాష్ట్రంపై చిన్న‌చూపు చూస్తున్నార‌ని చెప్పారు. రాష్ట్రంపై, చంద్రబాబుపై ఉన్న కోపం - ద్వేషం - అసూయ‌ - ఈర్ష్య వల్లే రాష్ట్రానికి రావాల్సినవి నిధులు రావడం లేదని - విభ‌జ‌న హామీలు అమ‌లు కావ‌డం లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. చంద్రబాబు నాయుడు మాస్ట‌ర్ మైండ్ - నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు చూసి మోదీకి భ‌యం ప‌ట్టుకుంద‌ని జేసీ అన్నారు. ఓ వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్ ప్ర‌తిపాద‌న‌ను తెర‌పైకి తెచ్చి మోదీపై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో థ‌ర్డ్ ఫ్రంట్ ను న‌డిపించ‌గ‌ల స‌త్తా చంద్ర‌బాబుకు ఉంద‌ని తెలియ‌జెప్ప‌డం కోస‌మే జేసీ ఈ ర‌క‌మైన వ్యాఖ్య‌లు చేశార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
Tags:    

Similar News