వినూత్న నిరసనకు దిగిన జేసీ!

Update: 2023-04-25 12:59 GMT
అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి వినూత్న నిరసనకు దిగారు. తాడిపత్రి మున్సిపాలిటీ లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలోనే నిరసన చేపట్టారు. ఏప్రిల్‌ 24 సోమవారం రాత్రి నిరసన చేపట్టిన జేసీ అక్కడే నిద్రించారు. నిరసనను మంగళవారం కూడా కొనసాగించారు.

ఇందులో భాగంగా తాడిపత్రి మున్సిపల్ కార్యాలయ ఆవరణలోనే జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆరు బయటే స్నానం చేశారు. ఆ తర్వాత మళ్లీ నిరసన శిబిరంలో కూర్చున్నారు. ఆయనతోపాటు తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి, పెద్దపప్పూరు మండలాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా నిరసన శిబిరంలో కూర్చున్నారు.

మున్సిపాలిటీ లో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో చర్యలు తీసుకోకుండా మున్సిపల్‌ కమిషనర్, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వారు నిరసన చేపట్టారు. వైసీపీ నేతల అక్రమాల పై మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలోనే వంటావార్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

మున్సిపాలిటీలో డీజిల్, టైర్ల దొంగతనం పై మున్సిపల్‌ కమిషనర్‌ బాధ్యత వహించాలని టీడీపీ కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్న కమిషనర్‌ తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సాయంత్రం మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి నిరసనకు మద్దతు పలికి, రాత్రి అక్కడే నిద్రించారు.

2014లో తాడిపత్రి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి 2019లో పోటీ చేయలేదు. తనకు బదులుగా తన కుమారుడు అస్మిత్‌ రెడ్డికి సీటు ఇప్పించారు. అయితే జేసీ అస్మిత్‌ రెడ్డి ఓడిపోయారు. మరో వైపు మునిసిపల్‌ ఎన్నికల్లో తాడిపత్రిలో టీడీపీ గెలుపొందడంతో జేసీ ప్రభాకర్‌ రెడ్డి మునిసిపల్‌ చైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టారు.

Similar News