వైసీపీలో మంత్రి వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. ఫ్లెక్సీల ర‌గ‌డ‌!

Update: 2023-06-24 09:00 GMT
ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని వైసీపీ నాయ‌కుల మ‌ధ్య వివాదాలు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ జోక్యం చేసుకుని ఒక‌సారి వివాదాల‌ను స‌ర్దు బాటు చేశారు. అయితే.. ఇప్పుడు మ‌రోసారి కొత్త‌వివాదాలు తెర‌మీదికి వ‌చ్చాయి. అవికూడా ఫ్లెక్సీల ర‌గ‌డ‌లు కావ‌డం.. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు, స‌వాళ్లు చేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.

జిల్లాలోని పెడ‌న నియోజ‌క వ‌ర్గం ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌కు, మైల‌వరం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌కు మ‌ధ్య  కొన్నాళ్ల కింద‌ట హోరా హ‌రో మాట‌ల యుద్ధం స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి జోగి పెత్త‌నం చేస్తున్నార‌ని వ‌సంత వ్యాఖ్యానించా రు.

తాను బీసీని కాబ‌ట్టే.. త‌న‌పై వ‌సంత రాజ‌కీయ దుమారం రేపుతున్నార‌ని జోగి రోడ్డుకెక్కారు. మొత్తానికి వీరి వివాదం తార‌స్థాయికి చేరుకున్న క్ర‌మంలో వైసీపీ అధినేత జోక్యం చేసుకుని స‌ర్దుబాటు చేశారు. ఇది జ‌రిగి రెండు మాసాలు కూడా కాక‌ముందే.. ఇప్పుడు ఇరు ప‌క్షాల మ‌ధ్య ఫ్లెక్సీల‌ర‌గ‌డ తెర‌మీదికి వ‌చ్చింది. మంత్రి జోగి ర‌మేష్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ఆయ‌న అనుచ‌రులు.. వ‌సంత నియోజ‌క‌వర్గ‌మైన మైల‌వ‌రం ప‌రిధిలోని ఇబ్ర‌హీంప‌ట్నంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతేకాదు.. పుట్టిన రోజు వేడుక‌ల‌ను కూడా ఘ‌నంగా నిర్వ‌హించారు.

అయితే.. తెల్ల‌వారే స‌రికి అగంతకులు కొంద‌రు స‌ద‌రు ఫ్లెక్సీలు చించి వేయడంతో ఫ్లెక్సీల రగడ ముదిరింది. ఎమ్మెల్యే వ‌సంత‌ కృష్ణ ప్రసాద్  త‌న అనుచరుల‌తో ఈ పని చేయించి ఉంటారని జోగి వర్గం మండిప‌డింది.

అంతేకాదు.. వ‌సంత ఫ్లెక్సీల‌ను కొంద‌రు మ‌రుస‌టి రోజు చించేశారు. దీంతో అటు మంత్రి, ఇటు ఎమ్మెల్యేలు త‌మ అనుచ‌రుల‌కు మౌఖిక ఆదేశాలు ఇచ్చి.. ఫ్లెక్సీల‌ను చించేయాల‌ని ఆదేశించిన‌ట్టు ఒక వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది.

వైసీపీలో కీల‌క నేత‌ల మ‌ధ్య  ఫ్లెక్సీల రగడ ముదరడంతో కొండపల్లి మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. ఇబ్రహీంపట్నం రింగ్ చుట్టూ ఉన్న ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. మంత్రి జోగి రమేష్ బంధువుల భవనంపై ఉన్న ఫ్లెక్సీని 24 గంటల్లో తొలగించాలని కొండపల్లి మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. నిబంధనల ప్రకారమే బిల్డింగ్‌పైన ఉన్న హోర్డింగ్‌లను తొలగించాలని భవన యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్  తెలిపారు. మ‌రి ఇది.. ఎటు దారి తీస్తుందో చూడాలి.

Similar News