ఆ టీఆర్ఎస్ నేత బీజేపీలోకి!

Update: 2022-04-03 11:30 GMT
తెలంగాణలో రాజ‌కీయ ప‌రిణామాలు కాక మీదున్నాయి. కేంద్రంలోని బీజేపీపై పోరు చేస్తున్న టీఆర్ఎస్ రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. మ‌రోవైపు రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్ర‌భుత్వ తీరుపై బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌ల‌తో సాగుతున్నారు. ఇక అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ రెండూ ప్ర‌జల‌ను పీడించే ప్ర‌భుత్వాలేన‌ని కాంగ్రెస్ విరుచుకుప‌డుతోంది.

ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని పార్టీ బ‌లోపేతంపై బీజేపీ ప్ర‌త్యేక దృష్టి సారించింది. చేరిక‌ల‌ను పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తోంది. ఉద్య‌మ కారుల‌ను, టీఆర్ఎస్ అసంతృప్త నేత‌ల‌కు బీజేపీ గాలం వేస్తుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

తాజాగా అధికార టీఆర్ఎస్‌కు షాక్ త‌గిలేలా ఆ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే భిక్ష‌మ‌య్య గౌడ్ బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఆలేరు నియోక‌వ‌ర్గానికి చెందిన భిక్ష‌మ‌య్య రెండు రోజుల్లో ఢిల్లీలో కాషాయ కండువా క‌ప్పుకుంటార‌ని తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో రాజ‌కీయ జీవితం ప్రారంభించిన ఆయ‌న ఉమ్మ‌డి ఏపీలో ఎమ్మెల్యేగా ప‌ని చేశారు.

అయితే రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓట‌మి త‌ప్ప‌లేదు. 2014, 2018 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి గొంగిడి సునీత చేతిలో ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు. దీంతో 2019లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు.

ఆలేరు నియోజ‌క‌వ‌ర్గంలో భిక్ష‌మ‌య్య‌కు మంచి ప‌ట్టుంది. కీల‌క నేత‌గా ప్ర‌జ‌ల‌ను  ఆక‌ట్టుకునే సామ‌ర్థ్యాలున్నాయి. కానీ ఇప్పుడు టీఆర్ఎస్‌లో స‌రైన గుర్తింపు లేక‌పోవ‌డంతో ఆయ‌న పార్టీ మారేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని టాక్‌. నామినేటెడ్ పోస్టులు ఆశించిన ఆయ‌న‌కు భంగ‌పాటు త‌ప్ప‌లేదు.

అందుకే రాష్ట్రంలో పుంజుకుంటున్న బీజేపీలోకి చేరేందుకు ఆయ‌న రెడీ అయ్యార‌ని స‌మాచారం. ఈ విష‌యంపై ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేత‌ల‌తో ఆయ‌న చ‌ర్చించిన‌ట్లు తెలిసింది. మ‌రోవైపు టీఆర్ఎస్ అసంతృప్త‌ల‌పై కన్నేసిన బీజేపీ వాళ్ల‌ను పార్టీలో చేర్చుకునే ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేసింది. త్వ‌ర‌లోనే మ‌రికొంత మంది నాయ‌కులు టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జంప్ అవుతార‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.
Tags:    

Similar News