జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెచ్చేందుకు తాను సిద్ధమని - ఇందుకోసం ఫెడరల్ ఫ్రంట్ తో ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన అడుగు కేవలం ప్రకటన వరకే పరిమితం కాకుండా...ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఇందులో మొదటగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఆయన సమావేశమయ్యారు. దానికి కొనకసాగింపుగా జార్ఖండ్ మాజీ సీఎం శిబుసోరెన్ తో సైతం సమావేశమయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రకాశ్ రాజ్ తో సైతం ఆయన చర్చలు జరిపారు. తాజాగా సీనియర్ జర్నలిస్ట్ - ప్రముఖ కాలమిస్ట్ - పద్మభూషణ్ శేఖర్ గుప్తతో భేటీ అయ్యారు.
ప్రగతిభవన్ లో శేఖర్ గుప్తాతో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. దేశ రాజకీయాలపై విపులంగా చర్చించారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయాన్ని శేఖర్ గుప్త బలపరిచారు. జాతీయ రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషించాలని నిర్ణయించుకున్న నేపథ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇంకా ప్రజలు కనీస అవసరాల కోసం ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్ చెప్పారు. ఇతర దేశాలు అభివృద్ధి పథంలో దూసుకపోతుంటే మన దేశం ఇంకా ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చలేని స్థితిలో ఉండడం బాధాకరమన్నారు. పాలకుల దృక్పథంలో మార్పు రాకపోతే ఈ పరిస్థితి ఎన్నటికీ మారదన్నారు. అనేక రాష్ట్రాల సమ్మిళితంగా ఉన్న భారత దేశంలో సమాఖ్య స్పూర్తి కొరవడడం వల్ల అన్ని విషయాల్లో సమనవ్వయలేమి స్పష్టంగా కనిపిస్తుందన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ వెలిబుచ్చిన అభిప్రాయాలతో శేఖర్ గుప్త ఏకీభవించారని సమాచారం. దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని శేఖర్ గుప్త అభిప్రాయ పడ్డారు. కేసీఆర్ ప్రయత్నాలు ఫలప్రదం కావాలని ఆకాంక్షించారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలుస్తోంది. దేశం ఎదురుకుంటున్న ప్రధాన సమస్యలు- వాటి పరిష్కారాలు, ఫెడరల్ వ్యవస్థకు ఉండాల్సిన లక్షణాలు – భారత దేశంలో ఫెడరల్ స్పూర్తికి కలుగుతున్న అవరోధాలు, దేశాభివృద్ధికి అడ్డుగా ఉన్న అంశాలు – వాటిని అధిగమించే మార్గాలు తదితర అంశాలపై ఇద్దరు విస్త్రతంగా చర్చించారని వివరించింది.