ఒక విజయం....ముగ్గురు సీఎం క్యాండిడేట్లు...?

Update: 2022-10-23 15:01 GMT
ఒక విజయం....ముగ్గురు సీఎం క్యాండిడేట్లు...?
  • whatsapp icon
ఏ రాజకీయ పార్టీకి అయినా తలనొప్పులు ఎక్కడ వస్తాయంటే సీట్ల దగ్గర. అలాగే అధికారం కోసం కూడా. రెండు రాజకీయ పార్టీలు కాస్తా సమానమైన అధికారాల కోసం గురి పెట్టినపుడు అది ఇబ్బందిగా మారుతుంది. కూటమి ఐక్యతకు కూడా ఒక దశలో అది ట్రబుల్ ఇచ్చే ప్రమాదం ఉంటుంది. ఏపీలో చూస్తే జనసేనతో పొత్తు టీడీపీని విచిత్రమైన అనూహ్యమైన అనుభవం అనే అంటున్నారు. ఈ పొత్తు ఏమైనా కొత్తదా అని కొందరు అనుకోవచ్చు. ఎందుకంటే 2014లో కూడా జనసేన టీడీపీకి మద్దతు ఇచ్చింది కదా అని చెప్పవచ్చు. కానీ నాడు జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేవలం మద్దతు పార్టీగానే ఉంది. అయితే 2024లో సీన్ వేరు.

ఈసారి జనసేన పోటీ పడనుంది. అది కూడా ఏకంగా ముఖ్యమంత్రి సీటు మీద కన్నేసి జనసేన బరిలోకి దిగనుంది. అందుకే చాలా కాలంగా జనసేన నుంచి వినిపిస్తున్న స్వరాలు వేరేగా ఉంటున్నాయి.  రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తుల పరంగా చూస్తే కొందరు తగ్గాలి. గతంలో మేము తగ్గామని పవన్ గుర్తు చేశారు. నిజంగా చూస్తే పవన్ గిరి ఈసారి సీఎం సీటు మీద ఉంది అని చెప్పకనే చెప్పేశారు. అదే టైం లో జనసైనికులు కూడా ఎక్కడా తగ్గేది లేదు అంటున్నారు.

ఈ నేపధ్యం నుంచి చూసినపుడు జనసేనతో పొత్తు బీజేపీ వామపక్షాలతో లాంటి పొత్తు కాదు, వైసీపీ టీడీపీతో సమానంగా ఎదగాలని చూస్తున్న పార్టీ జనసేన. అంటే రెండు కీలక పార్టీల మధ్య పొత్తుగానే దీనిని చూడాలి. ఈ తరహా పొత్తులు తెలుగు రాజకీయాల్లోనూ ఎవరికీ అనుభవంలో లేనివే. యూపీ లాంటి చోట్ల అయితే సమాజ్ వాద్ పార్టీ బీఎస్పీ పొత్తులు పెట్టుకున్నాయి. సీఎం సీటు కోసం ఒప్పందాలు చేసుకున్నాయి. అలాగే కర్నాటకలో బీజేపీ జేడీఎస్ కూడా సీఎం సీటు కోసం ఒప్పందాలు చేసుకున్నాయి.

అలాగే కూటములు కట్టి గెలిచిన తరువాత ముందు అనుకున్న ప్రకారం చెరిసగం పాలన చేయాలి. లేదా సంఖ్యాబలం బట్టి ఒకరు మూడేళ్ళు, మరోకరు రెండేళ్ళు పాలన చేయాలి. ఆ విధంగా ఏపీలో కూడా పొత్తుల విషయంలో అధికార వాటా కోసం ఈసారి జనసేన పట్టుబట్టడం ఖాయమనే అంటున్నారు. అంటే జనసేన టీడీపీ కూటమి లోకి బీజేపీ సహా ఎన్ని పార్టీలు వచ్చినా కూడా అధికార వాటా విషయం మాత్రం ఈ రెండు పార్టీల మధ్యనే తేలాల్సి ఉంటుంది.

ఆ విధంగా ఆలోచిస్తే ఈ కూటమి గెలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఎటూ చెప్పుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మరో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉంటారు. ఇక టీడీపీకి భావి వారసుడు లోకేష్ ఎటూ సీఎం క్యాండిడేట్ అని ప్రచారం సాగుతోంది. చంద్రబాబు ఏడు పదుల వయసులో ఇపుడు ఎన్నికలలో గెలుపు కోసం నానా రకాలైన కష్టాలు పడుతోంది తన కోసం కాదు, తాను ముమ్మారు సీఎం గా పనిచేశారు. అందువల్ల లోకేష్ కోసం అని చెప్పుకోవాలి. అలాగని బాబు సీఎం అవరా అంటే అవుతారు.

ఆయన శపధాలు కూడా ఉన్నాయి. సీఎం గానే ఏపీ అసెంబ్లీలో తాను అడుగుపెడతాను అని బాబు గత ఏడాది అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా సీఎం కోసమే చూస్తున్నారు. లోకేష్ కూడా సీఎం అయ్యేది ఈ టెర్మ్ లోనే అంటున్నారు. ఉన్నది ఒక్కటే కుర్చీ దక్కేది ఒక్కటే విజయం. మరి ఎలా అంటే ఈ పవర్ షేరింగ్ అన్నది ఒక విధంగా ఇబ్బందే అంటున్నారు. అదే టైం లో చాలా ఆసక్తికరమని కూడా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే మరి ఈ పొత్తులు పవర్ షేరింగ్ గురించి ముందే ఆలోచించారో ఏమో కానీ సీపిఐ  రామక్రిష్ణ అయితే చంద్రబాబుని కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లమని కోరుతున్నట్లుగా ఈ మధ్యనే ఒక ప్రకటన వచ్చింది. అదే జరిగితే బాబు కేంద్ర రాజకీయాలో ఉంటే ఏపీకి సీఎంలుగా పవన్ లోకేష్ చెరి రెండున్నరేళ్ళు పంచుకోవచ్చు. ఇది కూడా బాగానే ఉంది మరి. కానీ బాబు గారు ఈ దఫా అలా ఊరుకుంటారా. టీడీపీ జనాలు అమరావతి రైతులు కానీ బాబుతోనే ఏపీ అభివృద్ధి అని భావించే వారు కానీ ఊరుకుంటారా. చూడాలి మరి.
Tags:    

Similar News