టీఆర్ ఎస్ మంత్రికి, ఎంపీకీ షాక్

Update: 2015-08-18 09:38 GMT
తెలంగాణ‌-క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దులో కృష్ణాన‌దిపై క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం గిరిజాపూర్ బ్యారేజీని నిర్మిస్తోంది. తెలంగాణ ప్ర‌భుత్వం ఇది అక్ర‌మ ప్రాజెక్ట‌ని ఆరోపిస్తోంది. ఈ నేప‌థ్యంలో మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ జిల్లాకు చెందిన మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ ఎంపీ జితేంద‌ర్‌ రెడ్డితో పాటు ప‌లువురు ప్ర‌తినిధుల బృందం మంగ‌ళ‌వారం ఆ ప్రాజెక్టును ప‌రిశీలించేందుకు అక్క‌డ‌కు వెళ్లింది.

తెలంగాణ ఎంపీ, మంత్రితో పాటు భారీ ఎత్తున ప్ర‌జ‌లు క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దుకు చేరుకోగానే ఆ రాష్ర్ట పోలీసులు వారిని అడ్డుకున్నారు. మా ప్ర‌భుత్వం అనుమ‌తి లేకుండా బ్యారేజీ ని సంద‌ర్శించ‌డానికి వీలులేద‌ని వారు తేల్చిచెప్పారు. దీంతో తెలంగాణ ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు, క‌ర్ణాట‌క పోలీసుల‌కు వాగ్వివాదం జ‌రిగింది. ఎంపీ జితేంద‌ర్‌ రెడ్డి వారితో త‌మ‌ను ప్రాజెక్టు చూడ‌డానికి వెళ్ల‌నీయాల్సిందేనంటూ గొడ‌వ‌కు దిగారు.

జూప‌ల్లి, జితేంద‌ర్‌ తో పాటు వారంతా అక్క‌డే భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదిలా ఉంటే కృష్ణాన‌ది పై ఉన్న శ్రీశైలం, నాగార్జునా సాగ‌ర్ ప్రాజెక్టుల‌లో నీటిమ‌ట్టం దారుణంగా ప‌డిపోయింది. సాగ‌ర్ నీటిమ‌ట్టం నిల్వ‌లు రోజురోజుకు త‌గ్గిపోతున్నాయి. ఎగువ నుంచి నీరు రాకపోయినా అవ‌స‌రాల‌కు వాడేస్తున్నారు. ఇప్పుడే ఇంత దారుణ ప‌రిస్థితులు ఉంటే క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం అక్ర‌మంగా మ‌రిన్ని కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తే తెలంగాణ‌కు నీటి ఎద్ద‌డి త‌ప్ప‌దు. గిరిజాపూర్ వ‌ద్ద రోడ్ కం బ్రిడ్జి పేరుతో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఈ అక్ర‌మ ప్రాజెక్టు నిర్మాణానికి తెర‌దీసింది.
Tags:    

Similar News