పల్లాకు కారు లేదు.. కోదండంకు అప్పుల్లేవ్.. కె.నాగేశ్వర్ ఆస్తి ఎంతంటే?

Update: 2021-02-23 11:30 GMT
హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి.. నల్గొండ.. ఖమ్మం.. వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజుతో నామినేషన్ల ఘట్టం పూర్తి కానుంది. ఇప్పటివరకు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు బరిలోకి దిగారు. నామినేషన్లు దాఖలు చేశారు. మార్చి 14న జరిగే ఈ ఎన్నికల ఫలితాలు 17న వెల్లడి కానున్నాయి.

ఇప్పటివరకు హైదరాబాద్ స్థానానికి సోమవారం నాటికి 59 నామినేషన్లు దాఖలు కాగా.. నల్గొండలో మొత్తం 48 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రోజు మరిన్ని నామినేషన్లుదాఖలయ్యే అవకాశం ఉంది. వీరిలో ఎంతమంది నామినేషన్లను ఉపసంహరించుకుంటారన్నది ఈ నెల 26న తేలనుంది.

ఈ రెండు స్థానాలకు సంబంధించి ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల్ని చూస్తే.. నల్గొండలో టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ తరఫున సబావత్ రాములునాయక్.. బీజేపీ తరఫున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి.. యువ తెలంగాణ పార్టీ తరఫున గోగుల రాణిరుద్రమ.. సీపీఐ తరఫున జయసారథిరెడ్డి.. టీజేసీఎస్ తరఫున ముద్దసాని కోదండరాంరెడ్డి.. టీఐపీ తరఫున చెరుకు సుధాకర్.. స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)లు ఉన్నారు.

అదే సమయంలో హైదరాబాద్ స్థానానికి టీఆర్ఎస్ తరఫున పీవీ కుమార్తె సురభి వాణిదేవి.. బీజేపీ తరఫున ఎన్. రామచందర్ రావు.. కాంగ్రెస్ తరఫున జి.చిన్నారెడ్డి.. స్వతంత్ర్య అభ్యర్థులుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ తదితరులు ఉన్నారు. నామినేషన్ దాఖలు సందర్భంగా తమ ఆస్తుల అప్పుల వివరాల్ని వెల్లడించారు. అఫిడవిట్లో పేర్కొన్న దాని ప్రకారం నల్గొండ నుంచి బరిలో ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆస్తులు రూ.31.7 కోట్లు కాగా.. ఆయన పేరుతో కారు లేదు. బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఆస్తులు రూ.3.72 కోట్లుగా పేర్కొన్నారు.

హైదరాబాద్ లోని నందగిరి హిల్స్ లో నివాసం ఉండే పల్లాకు కారు లేదు కానీ ఆయన సతీమణికి మారుతి సెలెరియా కారు ఉంది. మార్కెట్ విలువ ప్రకారం రూ.9.66 కోట్ల విలువైన భూములు ఆయన పేరుతో ఉన్నాయి. ఆయన సతీమణి పేరుతో రూ.6.28 కోట్లు.. కుటుంబ సభ్యుల పేరుతో రూ.2.6 కోట్లు ఉన్నాయి. రూ.4.10 కోట్ల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు. ఉస్మానియా వర్సిటీ నుంచి ఫిజిక్స్ లో పీహెచ్ డీ పూర్తి చేశారు.

బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి నివాసం వరంగల్. ఆయనకు ఆస్తులు రూ.3.72 కోట్లు. వరంగల్ లో నిర్వహించిన ధర్నా నేపథ్యంలో ఆయనపై కేసు ఉంది. భార్యకు 75 తులాల బంగారం ఉండగా.. ఆయనకు రూ.86.79 లక్షల అప్పుగా ఉన్నట్లు తేలింది. కోదండం మాష్టారికి రూ.2.6 కోట్ల ఆస్తులు ఉండగా.. అప్పులు లేవు.. నేర చరిత్ర లేదని తేల్చారు. ఉస్మానియా నుంచి పీహెచ్ డీ పూర్తి చేశారు.  మరో అభ్యర్థి రాములునాయక్ నివాసం హైదరాబాద్. ఆయనకు నేరచరిత్ర లేదు.. హైదరాబాద్.. నారాయణఖేడ్ లో ఇళ్లు ఉన్నాయి. ఆస్తుల విలువ రూ.1.88 కోట్లుగా పేర్కొన్నారు.

హైదరాబాద్ అభ్యర్థులుగా బరిలో ఉన్న కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి వనపర్తికి చెందిన వారు. ఆగ్రికల్చరల్ లో పీహెచ్ డీ చేశారు. పలు ప్రాంతాల్లో వ్యవసాయ భూములు.. ఇళ్లు ఉన్నాయి.మరో అభ్యర్థి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ కు రూ.4కోట్ల వరకు స్థిర.. చర ఆస్తులు ఉన్నాయి.
Tags:    

Similar News